యాచకుడి వద్ద ఎంత డబ్బో...సంచి తెరిచి చూస్తే షాక్‌!
గడచిన పన్నెండేళ్లుగా ఓ దర్గా వద్ద యాచన చేసుకుంటూ బతుకీడుస్తున్న వ్యక్తి నిన్న చనిపోయాడు. దీంతో స్థానికులు అందించిన సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు అతనివద్ద ఉన్న సంచి తెరిచి చూసి షాక్‌ అయ్యారు. కొత్త వస్త్రాలు, డబ్బు కట్టలు  ఉండడంతో అమితాశ్చర్యానికి లోనయ్యారు.

 వివరాల్లోకి వెళితే... ఏపీలోని అనంతపురం జిల్లా పాతగుంతకల్లులోని మస్తానయ్య దర్గా వద్ద షేక్‌బషీర్‌ (75) అనే వ్యక్తి గడచిన పన్నెండేళ్లుగా యాచన చేసుకుంటూ అక్కడే ఉంటున్నాడు. కదిరి ప్రాంతానికి చెందిన ఇతనికి ఎవరూ లేకపోవడంతో నగరానికి వచ్చి యాచిస్తూ గడుపుతున్నాడు. బుధవారం ఇతను మృతి చెందడంతో దర్గా ప్రతినిధులు పోలీసులకు సమాచారం అందించారు.

దర్గా వద్దకు చేరుకున్న ఎస్‌ఐ మృతుని వద్ద ఉన్న బ్యాగులు పరిశీలించారు. అందులో కొత్త దుస్తులు, భారీగా నగదు ఉన్నట్లు గుర్తించి షాక్‌ అయ్యారు. వెంటనే స్థానిక పెద్దలను పిలిచి వారి సమక్షంలో సంచిలోని నగదు లెక్కించారు. మొత్తం 3 లక్షల 23 వేల 217 రూపాయల నగదు ఉంది.

షేక్‌బషీర్‌కు ఎవరూ లేకపోవడంతో అతని అంత్యక్రియల నిమిత్తం 13 వేల రూపాయలు ఆ నగదు నుంచి అందించి మిగిలిన మొత్తాన్ని ట్రెజరీలో జమ చేయనున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. కాగా, యాచకుని వద్ద భారీ మొత్తంలో నగదు ఉన్నట్లు తెలుసుకున్న స్థానికులు అవాక్కయ్యారు.
Thu, Jun 27, 2019, 11:46 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View