కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...ముగ్గురి దుర్మరణం
Advertisement
Advertisement
తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లాలో జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలోని సదాశివనగర్‌ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి క్రాసింగ్‌ వద్ద అదుపుతప్పిన కారు అదే రోడ్డులో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ఈ ఘోరం చోటు చేసుకుంది. బాధితులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు.

పోలీసుల కథనం మేరకు...హైదరాబాద్‌ వనస్థలిపురానికి చెందిన రాకేష్‌ కుటుంబం నిర్మల్‌ జిల్లా బాసరలోని సరస్వతీదేవి ఆలయానికి అక్షరాభ్యాసం కోసం కారులో వెళ్తున్నారు. అతివేగంగా వస్తున్న వీరి కారు క్రాసింగ్‌ వద్దకు వచ్చేసరికి అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి అటువైపు రోడ్డువైపు దూసుకుపోయింది. అదే సమయంలో అటువైపు రోడ్డులో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. కారు బలంగా ఢీకొట్టడంలో లారీ డీజిల్‌ ట్యాంకు పగిలి మంటలు చెలరేగాయి. దీంతో లారీ అగ్నికి ఆహుతి అయ్యింది. ఈ ప్రమాదంలో రాకేష్‌ భార్య, బావమరిది, అత్త ఘటనా స్థలిలోనే చనిపోయారు. రాకేష్‌కు కుడి భుజం విరిగిపోగా, అతని కుమారుడు అభిరామ్‌కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను కామారెడ్డిలోని ఆసుపత్రికి తరలించారు.
Thu, Jun 27, 2019, 10:48 AM
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View