నాతో పాటు చిరంజీవి, బాలకృష్ణ... అందరం చనిపోవాల్సింది... దేవుడి దయతోనే బతికాం: విజయశాంతి
Advertisement
విజయశాంతి... తన గ్లామర్, యాక్షన్, పెర్ఫార్మెన్స్ తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న నటి. ఆమె చివరి సారిగా కనిపించింది 2006లో వచ్చిన 'నాయుడమ్మ'లోనే. దాదాపు 13 సంవత్సరాల పాటు వెండితెరకు దూరంగా ఉన్న విజయశాంతి, మహేశ్ బాబు హీరోగా నటించనున్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంతో తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె పలు కీలక విషయాలను గుర్తు చేసుకున్నారు. తాను సంవత్సరానికి 17 సినిమాలు చేసిన రోజులున్నాయని, రోజుకు 7 షిఫ్ట్ లు పని చేశానని, తన కెరీర్ ను ఓ క్రమశిక్షణతో తీర్చిదిద్దుకోవడంతోనే ఇది సాధ్యమైందని చెప్పుకొచ్చారు. తన కెరీర్ లో ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొన్నానని, పంచభూతాలతో పోరాడాల్సి వచ్చిందని, పలుమార్లు గాయాలయ్యాయని కూడా అన్నారు. ఓ సినిమా షూటింగ్ లో నీళ్లల్లో కొట్టుకుపోయానని, మరో షూటింగ్ లో మంటల్లో చిక్కుకున్నానని వెల్లడించారు.

తన జీవితంలో గుర్తుండిపోయిన విషయాల గురించి చెబుతూ, తిరుపతి సమీపంలో జరిగిన విమాన ప్రమాదాన్ని గుర్తు చేసుకున్నారు. విమానంలో తనతో పాటు చిరంజీవి, బాలకృష్ణ వంటి ఎంతో మంది ప్రముఖులు ప్రయాణిస్తున్న వేళ, ఆ విమానం క్రాష్ ల్యాండ్ అయిందని, ఈ ఘటన అందరికీ గుర్తుండే ఉంటుందని చెబుతూ, ఆ ప్రమాదంలో తామంతా మరణించాల్సిందని, దేవుడి దయతోనే బతికి బయటపడ్డామని వ్యాఖ్యానించారు.

తనపై ప్రేక్షకులు చూపిన అభిమానంతోనే హీరోలకన్నా అధికంగా పారితోషికం తీసుకున్నానని వ్యాఖ్యానించిన ఆమె, ఎంతో మంది తనను నమ్మి ముఖ్యమైన పాత్రలు ఇచ్చారని అన్నారు. 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో నటించాలని తనను ఎవరూ ఒప్పించలేదని, రాజకీయాల నుంచి చిన్న గ్యాప్ లభించిన కారణంతోనే సినిమాను అంగీకరించారని అన్నారు. అనిల్ రావిపూడి చాలా కాలం నుంచి తనకో కథను చెప్పాలని తిరిగారని, ఆ కథ నచ్చడంతోనే ఒప్పుకున్నానని, మహేశ్ బాబుతో కలిసి నటించేందుకు వేచి చూస్తున్నానని అన్నారు.
Sun, Jun 23, 2019, 09:46 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View