దక్షిణాఫ్రికాపై కివీస్ థ్రిల్లింగ్ విక్టరీ.. సౌతాఫ్రికా సెమీస్ అవకాశాలు లేనట్టే!
Advertisement
ప్రపంచకప్‌లో భాగంగా బర్మింగ్‌హామ్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఉత్కంఠ పోరులో కివీస్ విజయం సాధించింది. విలియమ్సన్ కెప్టెన్ ఇన్నింగ్స్‌కు తోడు చివర్లో గ్రాండ్‌హోమ్ మెరుపులతో మరో మూడు బంతులు మిగిలి ఉండగానే న్యూజిలాండ్ జయకేతనం ఎగురవేసింది.

వర్షం కారణంగా 49 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 241 పరుగులు చేశారు. హషీం ఆమ్లా (55), మార్కరమ్(38), డుసెన్ (67-నాటౌట్), డేవిడ్ మిల్లర్ (36) రాణించడంతో ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది.

అనంతరం 242 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 80 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఓటమికి దగ్గరవుతున్నట్టు కనిపించినప్పటికీ కెప్టెన్ విలియమ్సన్ క్రీజులో పాతుకుపోయి జట్టుకు అద్వితీయ విజయాన్ని అందించాడు. 138 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్‌‌తో అజేయంగా 106 పరుగులు చేశాడు. గ్రాండ్‌హోమ్ 47 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 60 పరుగులు చేశాడు. దీంతో మరో మూడు బంతులు మిగిలి ఉండగానే ఆరు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన విలియమ్సన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.

ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఆడిన కివీస్ ఓటమన్నదే లేకుండా దూసుకుపోతోంది. 9 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. ఇక ఆరు మ్యాచ్‌లు ఆడిన దక్షిణాఫ్రికా నాలుగింటిలో ఓడి మూడు పాయింట్లతో కింది నుంచి మూడో స్థానంలో ఉంది. కాగా, ఈ ఓటమితో దక్షిణాఫ్రికా సెమీస్ అవకాశాలు దాదాపు మూసుకుపోయినట్టే.
Thu, Jun 20, 2019, 06:23 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View