కుల పెద్దల తీర్పు నేపథ్యంలో.. పురుగుల మందు తాగిన మహిళ
తాము ఇచ్చిన తీర్పును ధిక్కరిస్తున్నారంటూ గ్రామ పెద్దలు బెదిరింపులకు పాల్పడటంతో ఓ మహిళ వారి ముందే పురుగుల మందు తాగిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. బయ్యారం మండలం కొత్తగూడేనికి చెందిన ఈశాల ధనుంజయ, పద్మల పెద్ద కుమారుడు నాగేష్ నాలుగేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించాడు. కొద్ది రోజుల పాటు వారిద్దరూ వేరే ప్రాంతంలో నివాసముండి తరువాత తిరిగి స్వగ్రామానికి చేరుకున్నారు. అనంతరం వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో అమ్మాయి తన పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో అమ్మాయి తరుపు కుటుంబ సభ్యులు గ్రామ పెద్దలను ఆశ్రయించారు.

పంచాయతీ నిర్వహించిన గ్రామపెద్దలు ధనుంజయ కుటుంబం రూ.4 లక్షలు జరిమానా చెల్లించాలని తీర్పు ఇచ్చారు. అయితే గ్రామపెద్దలు తీర్పు ఇచ్చి నాలుగేళ్లవుతున్నా ధనుంజయ కుటుంబం డబ్బు చెల్లించకపోవడంతో అమ్మాయి కుటుంబ సభ్యులు అదే గ్రామ పెద్దలతో కలిసి ధనుంజయ ఇంటికి వెళ్లి డబ్బు కోసం ఆ కుటుంబంపై ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన ధనుంజయ భార్య పద్మ వారి ముందే పురుగుల మందు తాగేసింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆమెను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది.
Wed, Jun 19, 2019, 07:17 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View