మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డికి బెదిరింపులు!
Advertisement
తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డికి ఫోన్‌ లో బెదిరింపులు రాగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు, బాలకిరణ్ రెడ్డి అనే యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కడప జిల్లా జమ్మలమడుగు పోలీసు స్టేషన్ కు అందిన ఫిర్యాదు ప్రకారం, మరిన్ని వివరాల్లోకి వెళితే 13వ తేదీ రాత్రి, ఆపై 14వ తేదీ ఉదయం ఆదినారాయణరెడ్డికి, గుంటూరు జిల్లా అచ్చంపేటకు చెందిన బాలకిరణ్‌ రెడ్డి ఫోన్ చేశాడు. తామంతా మిమ్మల్నే నమ్ముకున్నామని, మీవల్ల చాలా నష్టం కలిగిందని, రూ. 75 లక్షలు ఇవ్వాల్సిందేనని బెదిరింపులకు పాల్పడ్డాడు.

దీనిపై ఆదినారాయణరెడ్డి ప్రధాన అనుచరుడు, దేవగుడికి చెందిన కిరణ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ నంబర్ ఆధారంగా నిందితుడిని ట్రేస్ చేసిన పోలీసులు, అతన్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నిందితుడి పూర్తి సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నామని డీఎస్పీ కే కృష్ణన్ వెల్లడించారు. కాగా, తన కుమారుడిని పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేశారని, అతన్ని ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పాలని బాలకిరణ్ రెడ్డి తండ్రి డిమాండ్ చేశారు.
Sun, Jun 16, 2019, 09:22 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View