ఎంఐఎంకు ప్రతిపక్ష హోదా ఇవ్వడమంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్టే: బీజేపీ నేత లక్ష్మణ్
Advertisement
తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మిత్రపక్షంగా పోటీ చేసిన ఎంఐఎంకు ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వడమంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అవుతుందని టీ-బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. హైదరాబాద్ లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్ లో సీఎల్పీ విలీనం చేయడం కరెక్టు కాదని, ఫిరాయింపుల చట్టంలో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకుని టీఆర్ఎస్ తప్పు చేయడం సరికాదని మండిపడ్డారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని పునరుద్ఘాటించారు. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత బీజేపీకి అనువైనటువంటి ప్రాంతం తెలంగాణ అని అన్నారు. తెలంగాణకు జాతీయ నాయకత్వం, మోదీ ప్రభుత్వం అండదండలు పూర్తి స్థాయిలో ఉంటాయని అన్నారు.

 
తెలంగాణలో అధికార పార్టీ వైఫల్యాలు, కుటుంబ పాలన, ప్రజావ్యతిరేక పాలనపై పోరాటాలు, ఉద్యమాలను ఉద్ధృతం చేస్తామని, అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందుకు వెళతామని చెప్పారు. ఫిరాయింపు రాజకీయాల్లో టీఆర్ఎస్ నంబర్ వన్ అని విమర్శించారు. విద్యా వ్యవస్థలో రాష్ట్రాన్ని ముందుంచుతానని చెప్పిన సీఎం కేసీఆర్ ఆ మాటే మరిచారని దుయ్యబట్టారు. తెలంగాణలోని పాఠశాలలు, కళాశాలల్లో ఫీజుల నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను పూర్తిగా విస్మరించిందని, రాష్ట్రంలో పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి గందరగోళంగా తయారైందని విమర్శించారు.
Wed, Jun 12, 2019, 09:33 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View