అపహరణకు గురవుతున్నారన్న వార్తలను నమ్మొద్దు: తెలంగాణ ప్రజలకు డీజీపీ విజ్ఞప్తి
Advertisement
తెలంగాణ రాష్ట్రంలో మహిళలు, పిల్లలు, పెద్ద వయసు వారు అపహరణకు గురవుతున్నారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో డీజీపీ మహేందర్ రెడ్డి స్పందించారు. ఈ దుష్ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలకు సూచించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ఇలాంటి కేసులలో చాలా వరకూ కుటుంబ వ్యవహారాలు, ప్రేమ సంఘటనలు, పరీక్షల్లో తప్పడం వల్ల వెళ్లిపోయే పిల్లలు, తమ తల్లిదండ్రులపై అలిగి మరికొందరు పిల్లలు, పిల్లల సంరక్షణ దొరకని వృద్ధులైన తల్లిదండ్రులు ఇళ్లు విడిచి వెళ్లిపోయినవే ఉన్నాయని అన్నారు.

ఇందుకు సంబంధించి నమోదైన కేసుల్లో 85 శాతానికి పైగా పరిష్కరించినట్టు చెప్పారు. మిగిలిన కేసుల పరిష్కారానికీ పోలీస్ శాఖ అన్ని ప్రయత్నాలు చేస్తుందని, సమాజంలోని అన్ని వర్గాల భద్రతకు కట్టుబడి పోలీసు సిబ్బంది అహర్నిశలు పనిచేస్తున్నారని ఆ ట్వీట్ లో ఆయన పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లో భయాందోళనలు సృష్టించే విధంగా వదంతులు వ్యాపింపజేయొద్దని కోరారు. ఇలాంటి పనులకు ఎవరైనా పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Wed, Jun 12, 2019, 09:15 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View