భారత్-పాక్ వరల్డ్ కప్ మ్యాచ్ పై యాడ్స్... మండిపడుతున్న సానియా మీర్జా
Advertisement
చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ ఏ వేదికపై తలపడినా ఆ మ్యాచ్ కు లభించే ఆదరణ అంతాఇంతా కాదు. ఇక వరల్డ్ కప్ అయితే చెప్పేదేముంది? అభిమానుల ఉత్సాహం గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో దాయాదుల సమరాన్ని సొమ్ము చేసుకునేందుకు టీవీ చానళ్లు కూడా విభిన్నమైన వాణిజ్య ప్రకటనలు రూపొందిస్తున్నాయి. త్వరలోనే భారత్, పాక్ జట్లు వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ (జూన్ 16) లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. దీనికోసం అటు పాకిస్థాన్ లోనూ, ఇటు ఇండియాలోనూ టీవీ చానళ్లు కొత్త పోకడలతో యాడ్స్ రూపొందించాయి. అయితే ఈ యాడ్స్ పై ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అసహనం వ్యక్తం చేశారు.

భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ వేషధారణతో ఉన్న ఓ వ్యక్తి ఈ మ్యాచ్ కోసం భారత్ ఎలాంటి సన్నాహాలు చేస్తుందో వివరిస్తున్నట్టుగా పాకిస్థాన్ టీవీ చానళ్లలో ఓ యాడ్ ప్రసారమవుతోంది. ఇదో సెటైరికల్ యాడ్. ఇంతకుముందు భారత్ చేతిలో పాకిస్థాన్ ఎన్నిసార్లు మట్టికరిచిందో వివరిస్తూ భారత్ లో కూడా ఓ యాడ్ వస్తోంది. వీటిపై సానియా తనదైన శైలిలో విమర్శలు చేశారు.

"ఈ మ్యాచ్ ను సొమ్ము చేసుకోవడానికి ఇంత చెత్తను యాడ్స్ రూపంలో గుప్పించనవసరంలేదు. ఇప్పటికే కావాల్సినంత ప్రచారం లభించింది. ఈ విషయాన్ని సీరియస్ గానే చెబుతున్నాను. సరిహద్దుకు అటూ ఇటూ రెండు వైపుల నుంచి చిరాకుతెప్పించేలా యాడ్స్ వస్తున్నాయి. ఇదో ప్రముఖమైన మ్యాచ్. అంతకన్నా ఎక్కువే అని మీరు భావిస్తుంటే మాత్రం మిమ్మల్ని మీరు కట్టడి చేసుకోవాల్సిన అవసరం ఉంది" అంటూ హితవు పలికారు.

Wed, Jun 12, 2019, 07:29 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View