రైతు రుణమాఫీ వ్యక్తిగత, పార్టీపరమైన హామీగా ఉమ్మారెడ్డి పేర్కొనడం దారుణం: యనమల
Advertisement
రైతు రుణమాఫీ పథకం టీడీపీ ఇచ్చిన హామీ మాత్రమే అని, అది ప్రభుత్వపరమైన హామీ కాదని వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించడంపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీపరమైన హామీలకు, ప్రభుత్వ హామీలకు చాలా తేడా ఉంటుందని, రైతు రుణమాఫీకి సంబంధించి 4,5 విడతల కిస్తీలను ప్రభుత్వమే చెల్లించాలని టీడీపీ సూచించడం సరికాదని అంతకుముందు ఉమ్మారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. దీనిపై, యనమల స్పందిస్తూ, రైతు రుణమాఫీని వ్యక్తిగత, పార్టీపరమైన హామీగా ఉమ్మారెడ్డి పేర్కొనడం దారుణమని అన్నారు. ఆయన వ్యాఖ్యలు రైతాంగం మొత్తానికి వ్యతిరేకం అని మండిపడ్డారు.

తాము ఇప్పటివరకు రూ.15,279 కోట్ల మేర రైతు రుణమాఫీ చేశామని, 4,5వ కిస్తీలకు సంబంధించి 10 శాతం వడ్డీతో మరో రూ.7,945 కోట్లు చెల్లించాల్సి ఉందని యనమల వివరించారు. ఆర్థిక, వ్యవసాయ శాఖ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్లు కూడా వచ్చాయని, రైతు సాధికార సంస్థ ఆర్థిక శాఖకు చెక్కులు కూడా అందజేసిందని వెల్లడించారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా అర్ధాంతరంగా రద్దుచేస్తున్నట్టు ప్రకటించారని ఆరోపించారు. ప్రభుత్వాలు మారినా ప్రభుత్వ విధానాలు మారవని, ప్రభుత్వాలకు ప్రజల సంక్షేమమే పరమావధిగా ఉండాలని యనమల రామకృష్ణుడు హితవు పలికారు.
Wed, Jun 12, 2019, 06:27 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View