తల్లికి రెండో పెళ్లి చేసిన యువకుడు.. లైకులు, షేర్లతో ప్రశంసల జల్లు కురిపిస్తున్న నెటిజన్లు!
Advertisement
తన కోసం తల్లి పడిన బాధను అర్థం చేసుకున్న ఓ తనయుడు ఆమెకు రెండో పెళ్లి చేసి ఎంతో ఆనందించాడు. తను ఆమెకు పెళ్లి చేయడం, దాని వెనుక ఉన్న కారణాలను వెల్లడిస్తూ ఆ యువకుడు ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. అతనిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. కేరళలోని కొల్లాం జిల్లాకు చెందిన గోకుల్ శ్రీధర్ నిన్న ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. తన తల్లికి ‘హ్యాపీ మ్యారీడ్ లైఫ్’ అని చెబుతూ రెండో భర్తతో ఉన్న ఫోటోను పోస్ట్ చేశాడు. దీంతో పాటు తన గత అనుభవాన్ని పంచుకున్నాడు.

తన తండ్రి ఓ రోజు తన తల్లిని కొట్టడంతో ఆమె తల నుంచి రక్తం రావడాన్ని గమనించి ఎందుకు భరిస్తున్నావు అమ్మా? అని అడిగానని తెలిపాడు. అప్పుడు తన తల్లి, తన కోసమే బతుకుతున్నానని, ఇంకా ఎంత బాధైనా భరిస్తానని తెలిపిందని చెప్పాడు. ఆ తరువాత తల్లితో కలిసి ఇంట్లో నుంచి వచ్చేశానని, ఆ రోజే తన తల్లికి మరో వివాహం చేయాలని నిర్ణయించుకున్నట్టు గోకుల్ శ్రీధర్ తెలిపాడు. తన కోసం జీవితాన్ని ధారపోసిన తల్లి గురించి ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిన పని లేదన్నాడు. గోకుల్ పోస్ట్ కొన్ని గంటల్లోనే వైరల్ అయింది. 30 వేలకు పైగా లైకులు, 3 వేలకు పైగా షేర్లు సంపాదించుకుంది. గోకుల్ నిర్ణయంపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
Wed, Jun 12, 2019, 06:19 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View