నిద్ర చెడగొట్టాడన్న కోపంతో ఆరు నెలల పసివాడిపై కన్నతల్లి అమానుషం!
నిద్ర చెడగొడుతున్నాడన్న కోపంతో ఆరు నెలల పసివాడి పట్ల కన్నతల్లే అమానుషంగా ప్రవర్తించిన ఘటన రాజస్థాన్‌లోని కోటాలో జరిగింది. బోరెఖెడాలోని సరస్వతి కాలనీలో ఓ భార్యాభర్తలు తమ ఆరు నెలల చిన్నారితో నివాసముంటున్నారు. రాత్రిపూట సదరు మహిళ గాఢ నిద్రలో ఉండగా తన కుమారుడి ఏడుపు వినిపించింది. దీంతో తన నిద్రను చెడగొట్టాడన్న కోపం ఆమెలో కట్టలు తెంచుకుంది. దాంతో పసివాణ్ణి తీసుకెళ్లి తమ ఇంట్లో రెండు అంతస్తుల పైనున్న నీళ్ల ట్యాంకులో పడేసి, ఏమీ ఎరగనట్టు వచ్చి పడుకుంది. తెల్లవారే చిన్నారి తండ్రి బిడ్డ కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులతో కలిసి వెదకడం ప్రారంభించాడు.

బిడ్డ తల్లి కూడా ఏమీ ఎరగనట్టుగా కుటుంబీకులతో పాటే కొడుకు కోసం వెదుకుతున్నట్టు నటించింది. చివరికి వాటర్ ట్యాంకులో చిన్నారి శవం తేలియాడటాన్ని పిల్లాడి నానమ్మ గుర్తించింది. వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో విచారణ ప్రారంభించిన పోలీసులు తల్లిని అనుమానించారు. తమదైన శైలిలో విచారణ నిర్వహించడంతో ఆమె కూడా నేరం ఒప్పుకుంది కానీ కొడుకును ఎందుకు వాటర్ ట్యాంకులో పడేసిందీ, అనంతరం ఎలా వచ్చి నిద్ర పోయిందీ తనకు తెలియదంటూ పేర్కొంది. ఆమెకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమెకు మానసిక అనారోగ్య సమస్యలేమీ లేవని తేల్చారు. ఆమెపై హత్యానేరం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
Wed, May 22, 2019, 06:48 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View