ఎన్నికల ఫలితాల వెల్లడి ఆలస్యమే: ద్వివేది
వీవీ ప్యాట్ లలోని స్లిప్ లను లెక్కించాల్సి వుండటంతో కౌంటింగ్ వేళ, అధికారిక ఫలితాల వెల్లడి ఆలస్యం కావచ్చని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ వెల్లడించారు. కొన్ని చోట్ల 23వ తేదీన అర్ధరాత్రి వరకూ ఫలితాలు వెల్లడి కాకపోవచ్చని, అయితే, మధ్యాహ్నానికే ట్రెండ్స్ తెలుస్తాయని ఆయన చెప్పారు. మొత్తం 24 వేల మందిని ఓట్ల లెక్కింపునకు నియమిస్తున్నామని, వీరికి అదనంగా 3 వేల మంది సిబ్బంది అందుబాటులో ఉంటారని ద్వివేది వెల్లడించారు.

కౌంటింగ్ చేసే సిబ్బంది ఏ నియోజకవర్గ ఓట్లను లెక్కిస్తారన్న విషయం చివరి వరకూ రహస్యమేనని, ర్యాండమైజేషన్ ద్వారా వీరిని నియమిస్తామని అన్నారు. 15వ తేదీ నుంచి కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ ఇస్తామని, ఆ తరువాత వారికి విధులను అప్పగిస్తామని అన్నారు. లెక్కింపు కేంద్రాల్లో సౌలభ్యాన్ని బట్టి 10 నుంచి 15 వరకూ కౌంటింగ్ టేబుళ్లుంటాయని చెప్పారు. వీవీ ప్యాట్ లలోని స్లిప్పుల లెక్కింపునకు ఆరు నుంచి ఏడు గంటల సమయం పడుతుందని అంచనా వేశారు. తొలుత పోస్టల్ బ్యాలెట్, ఆపై సర్వీస్ ఓట్లను లెక్కిస్తామని, ఆపై ఈవీఎంలలోని ఓట్లను, చివరిగా ఎంపిక చేసిన ఐదు వీవీ ప్యాట్ మెషీన్లలోని స్లిప్ లను లెక్కించి, సరిచూసి అధికారిక ఫలితం ప్రకటిస్తామని అన్నారు.
Fri, Apr 26, 2019, 10:09 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View