తొలి పది బంతుల్లో మూడు పరుగులు చేసిన కార్తీక్.. తర్వాతి 40 బంతుల్లో 94 బాదాడు!
Advertisement
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో గతరాత్రి రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా ఓటమి పాలైంది. మ్యాచ్ ఓడినప్పటికీ ఆ జట్టు కెప్టెన్ దినేశ్ కార్తీక్ ఆటతీరు అభిమానులను ఫిదా చేసింది. తొలి 15 ఓవర్లలో వంద పరుగులు మాత్రమే చేసిన కోల్‌కతా చివరి ఐదు ఓవర్లలో పరుగుల వరద పారించింది. కెప్టెన్ దినేశ్ కార్తీక్ రెచ్చిపోయి ఆడాడు. 50 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్లతో కోల్‌కతా బౌలర్లను ఊచకోత కోశాడు. మూడు పరుగుల తేడాతో సెంచరీని మిస్ చేసుకుని నాటౌట్‌గా నిలిచాడు. అంతేకాదు, కోల్‌కతా తరపున అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన రెండో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. గతంలో బ్రెండన్ మెకల్లమ్ 158 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కార్తీక్ తొలుత నిదానంగా ఆడాడు. తొలి పది బంతులకు అతడు చేసింది కేవలం మూడు పరుగులే. అయితే, వరుస పెట్టి వికెట్లు కోల్పోతున్న సమయంలో క్రీజులో పాతుకుపోవడానికి కొంత సమయం తీసుకున్న కార్తీక్ ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తాను ఎదుర్కొన్న తొలి పది బంతుల్లో మూడు పరుగులు చేసిన కార్తీక్ ఆ తర్వాతి 40 బంతుల్లో 94 పరుగులు చేశాడంటే అతడి బ్యాట్ చేసిన విధ్వంసం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. కాగా, 176 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఏడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది.
Fri, Apr 26, 2019, 10:03 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View