ఆ ఫోన్ ను తెచ్చిస్తే రూ.4 లక్షలు ఇస్తాం.. ప్రజలకు ఆనర్ కంపెనీ బంపరాఫర్!
Advertisement
సాధారణంగా మన మొబైల్ ఫోన్లు పోతే చాలా ఇబ్బంది పడిపోతాం. మన కాంటాక్టులు, బ్యాంకు ఖాతా వివరాలు అన్నీ దానితోనే ముడిపడి ఉంటాయి కాబట్టి నానా కష్టాలను ఎదుర్కొంటాం. తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్, ఫోన్ తయారీ కంపెనీ ఆనర్ కు ఇదే తరహా ఇబ్బంది వచ్చి పడింది. తమ ఉద్యోగి ఒకరు ఫోన్ ను పోగొట్టుకున్నారనీ, అది తీసుకొచ్చి ఇచ్చినవారికి రూ.4 లక్షలు(5,000 యూరోలు) ఇస్తామని ప్రకటించింది. ఓ ఫోన్ కు రూ.4 లక్షలు ఇవ్వడం ఏంటి? అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే అది ప్రోటోటైప్ ఫోన్. అంటే త్వరలో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్న మోడల్ అన్నమాట.

తమ సంస్థలో పనిచేసే ఉద్యోగి ఒకరు డస్సెడ్రాఫ్‌ నుంచి జర్మనీలోని మ్యూనిచ్‌కు ఐసీఈ 1125 రైలులో ఏప్రిల్‌ 22న వెళుతుండగా ఈ ఘటన జరిగిందని ఆనర్ తెలిపింది. ఈ ఫోన్ బూడిద రంగులో ఉందనీ, దీనికి కవర్ కూడా ఉందని వెల్లడించింది. ఈ మేరకు కంపెనీ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో స్పందించింది. అన్నట్లు వచ్చే నెల 21లోపే తీసుకురావాలనీ, ఆ తర్వాత తాము తీసుకోబోమని షరతు పెట్టింది. మే 21న  లండన్ లో జరిగే ఓ కార్యక్రమంలో ఆనర్ 20 సిరీస్ లో పలు మోడల్స్ ను విడుదల చేయనుంది. ఇటీవల చైనాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆనర్‌ 20, ఆనర్‌ 20 ప్రో, ఆనర్‌ 20ఏ, ఆనర్‌ 20సీ, ఆనర్‌ 20 ఎక్స్‌లను విడుదల చేసింది.
Thu, Apr 25, 2019, 03:22 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View