బాంబు పేలుళ్లకు పాల్పడిన వారి కోసం శ్రీలంక ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ వేట!
Advertisement
నరమేధం సృష్టించి, నెత్తుటి ఏర్లు పారించిన ఉగ్రవాదులను ఏరిపారేసేందుకు రాత్రికి రాత్రే వేలాది బలగాలను శ్రీలంక ప్రభుత్వం రంగంలోకి దించింది. వరుస పేలుళ్ల తర్వాత ఇప్పటి వరకు మీరు ఏమీ సాధించలేకపోయినట్టైతే, వెంటనే దిగిపోవాలంటూ పోలీస్ చీఫ్ తో పాటు రక్షణశాఖలోని ఉన్నతాధికారులను ఉద్దేశిస్తూ శ్రీలంక అధ్యక్షుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో సెక్యూరిటీ ఫోర్సెస్ కు పూర్తి అధికారాలను ఆయన ఇచ్చారు. ఈ నేపథ్యంలో, దేశంలోని వివిధ ప్రాంతాల్లో 75 మంది అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా బ్రిగేడియర్ సుమిత్ ఆటపట్టు మాట్లాడుతూ... ఇప్పటి వరకు 1,300 మంది సైనికులు రంగంలో ఉన్నారని... వీరి సంఖ్యను 6,300కు పెంచామని చెప్పారు. ఎయిర్ ఫోర్స్, నేవీ కూడా మరో 2వేల మందిని రంగంలోకి దించిందని తెలిపారు.

మరోవైపు, డ్రోన్లపై అధికారులు నిషేధం విధించారు. కమర్షియల్ ఆపరేటర్ల లైసెన్సులను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. రక్షణశాఖ డిప్యూటీ మంత్రి రువాన్ విజేవర్దనే మాట్లాడుతూ, అమెరికా నుంచి ఎఫ్బీఐ టీమ్ శ్రీలంకకు చేరుకుందని చెప్పారు. బ్రిటన్, ఆస్ట్రేలియా, యూఏఈ కూడా ఇంటెలిజెన్స్ సహకారాన్ని అందిస్తామని చెప్పాయని తెలిపారు. శ్రీలంకకు అన్ని విధాలా సహకరిస్తామని భారత ప్రధాని మోదీ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
Thu, Apr 25, 2019, 02:56 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View