ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై నిప్పులు చెరిగిన మంత్రి నక్కా ఆనందబాబు!
Advertisement
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యవహరిస్తున్న తీరుపై రాష్ట్ర మంత్రి నక్కా ఆనంద్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ విధులను కూడా సీఎస్ తన చేతుల్లోకి తీసుకుంటున్నారని నక్కా విమర్శించారు. ఇదంతా చూస్తుంటే ఏదో కుట్ర జరుగుతుందన్న అనుమానం వస్తోందని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో నక్కా మాట్లాడారు.

ఏపీ ప్రజలు చంద్రబాబును మాత్రమే సీఎంగా ఎన్నుకున్నారనీ, ఎల్వీ సుబ్రహ్మణ్యంను సీఎస్ గా ఎన్నుకోలేదని నక్కా ఆనందబాబు దుయ్యబట్టారు. కేంద్రంలో మోదీ సమీక్షలు చేస్తే లేని ఇబ్బంది ఏపీలో ప్రజా సంక్షేమంపై చంద్రబాబు సమీక్షలు చేస్తుంటే ఎందుకు వస్తోందని ప్రశ్నించారు.

సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు అందాల్సిన లబ్ధిని సీఎస్ అడ్డుకుంటున్నారని మంత్రి ఆరోపించారు. సీఎస్ తీరు రాజ్యాంగ విరుద్ధంగా, అప్రజాస్వామికంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్వీ సుబ్రహ్మణ్యంతో చెప్పుకోవాల్సిన స్థితిలో చంద్రబాబు లేరని నక్కా ఆనందబాబు స్పష్టం చేశారు. ఈసారి కూడా ఏపీలో టీడీపీయే అధికారంలోకి రాబోతోందని జోస్యం చెప్పారు.
Thu, Apr 25, 2019, 11:45 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View