గ్యాంగ్ స్టర్ నయీమ్ పేరిట బెదిరింపులు.. పోలీసుల అదుపులో యువకుడు!
Advertisement
గతంలో పోలీస్ ఎన్ కౌంటర్ లో హతమైన గ్యాంగ్ స్టర్ నయీమ్ అనుచరుడిని అంటూ ఓ యువకుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హైదరాబాద్ లోని హబ్సిగూడకు చెందిన ఎ.యాదవ్ రెడ్డి, పీర్జాదిగూడలోని చెన్నారెడ్డి ఎన్ క్లేవ్ లో ఉన్న శ్రీ సాయిహర ఎస్టేట్స్ ప్రైవేట్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అతని వద్ద టీవీ శ్రీనివాసరావు మార్కెటింగ్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు.

ఈ నెల 16న శ్రీనివాసరావుకు ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. తాను నయీమ్ అనుచరుడిని అని, తన పేరు రహీమ్ భాయి అని చెబుతూ, తనకు రూ.4 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించాడు. దీంతో భయపడిపోయిన శ్రీనివాసరావు తన యజమానికి ఈ విషయం చెప్పాడు. ఈ మేరకు మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఆయన ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిందితుడిని పట్టుకున్నారు. ఫోన్ కాల్స్ ఆధారంగా నిందితుడు బోడుప్పల్ లో ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు, అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు ఉప్పల్ లోని స్వరూప్ నగర్ నివాసి బేతి విజయ్ రెడ్డి అలియాస్ విక్కీ అలియాస్ రహీం. అతని వయసు ఇరవై సంవత్సరాలు. సివిల్ ఇంజనీరింగ్ లో డిప్లమో పూర్తి చేసిన అతను ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు. దీంతో, సులువుగా డబ్బు సంపాదించాలనుకుని ఈ ప్లాన్ వేశాడని పోలీసులు తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్టు పేర్కొన్నారు.
Mon, Apr 22, 2019, 09:32 PM
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View