​ బీజేపీ వైపు వేలెత్తి చూపితే వేళ్లు నరికేస్తా, కళ్లు పీకేస్తా: కేంద్ర మంత్రి మనోజ్ సిన్హా తీవ్ర వ్యాఖ్యలు
Advertisement
కేంద్ర మంత్రి మనోజ్ సిన్హా మరోసారి మాటల దూకుడు ప్రదర్శించారు. బీజేపీని విమర్శించేవారిని ఎవరినీ వదిలిపెట్టబోనని స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్ లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ, బీజేపీ శ్రేణుల పనితీరును విమర్శిస్తూ ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే నాలుగ్గంటల్లో వాళ్ల అంతు తేలుస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ వైపు వేలెత్తి చూపితే వాళ్ల వేళ్లు నరికేస్తా, కళ్లు పీకేస్తా అంటూ తీవ్రస్వరంతో హెచ్చరించారు.

ఈ ఐదేళ్ల కాలంలో దేశంలో అవినీతి నిర్మూలనలోనూ, అక్రమ ధన ప్రవాహాన్ని అడ్డుకోవడంలోనూ బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా శ్రమించిందని మనోజ్ సిన్హా తెలిపారు. సిన్హా ఈ ఎన్నికల్లో ఘాజీపూర్ లోక్ సభ స్థానం నుంచి పోటీచేస్తున్నారు.

ఇక వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆయనకు ఇదేమీ కొత్తకాదు. గతవారం మవుపారా గ్రామంలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి తొలి ప్రధాని అయ్యుంటే ఈరోజున ఉగ్రవాద భూతం ప్రజలను పీడించేది కాదని, కాంగ్రెస్ విధానాలే ఉగ్రవాదానికి ఊతమిచ్చాయని వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
Fri, Apr 19, 2019, 08:29 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View