మీ తప్పుడు లెక్కల వల్ల ఎంతోమంది ఇరుక్కున్నారు: విజయసాయికి దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చిన లక్ష్మీనారాయణ
Advertisement
'పోటీ చేసిందే 65 స్థానాలు అయితే, 88 సీట్లలో గెలుస్తామని ఎలా చెబుతారు జేడీ?' అంటూ కామెంట్ చేసిన వైసీపీ నేత విజయసాయిరెడ్డికి సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చారు. 'మీరు సీఏ చదివినా మీ లెక్కలు ఎందుకు తప్పుతున్నాయో అర్థం కావడంలేదు' అంటూ ట్వీట్ చేశారు. "జనసేన పార్టీ సొంతంగా పోటీచేసింది 140 స్థానాల్లో. మిత్రధర్మం ప్రకారం బీఎస్పీకి 21, వామపక్షాలకు 14 సీట్లు కేటాయించాం. ఆ విధంగా మొత్తం 175 స్థానాల్లో జనసేన దాని మిత్రపక్షాలు పోటీచేశాయి.

మా లెక్కలు కచ్చితంగా ఉంటాయి, మా లెక్కలు సరిగా ఉంటాయి.ఇప్పుడు లెక్కలు సరిచూసుకోవాల్సింది మీరే. మేం సత్యం, న్యాయం అనే అంశాల ప్రాతిపదికన పనిచేస్తున్నాం. ఇప్పటికే మీ తప్పుడు లెక్కల వల్ల అనేకమంది ఇరుక్కున్నారు. ఇకనైనా మంచి లెక్కలు నేర్పే విధానాన్ని మొదలుపెట్టండి" అంటూ ఘాటుగా బదులిచ్చారు.

జగన్ అక్రమాస్తుల కేసులో అనేక ఆర్థిక అవకతవకలు జరిగాయని సీబీఐ తన ఛార్జిషీట్ లో పేర్కొన్న సంగతి తెలిసిందే. జగన్ కంపెనీలకు ఆడిటింగ్ నిర్వహించి, ఆర్థిక లావాదేవీల లెక్కలను పర్యవేక్షించింది విజయసాయిరెడ్డి కావడంతో లక్ష్మీనారాయణ ఆ కోణంలో పరోక్ష వ్యాఖ్య చేసినట్టు అర్థమవుతోంది. జగన్ పై కేసులను సీబీఐ జేడీ హోదాలో లక్ష్మీనారాయణ చాలాకాలం పాటు విచారణ జరిపారు.
Fri, Apr 19, 2019, 07:52 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View