వారసత్వ రాజకీయాలను సమర్థించుకున్న కుమారస్వామి
Advertisement
వారసత్వ రాజకీయాలు చేస్తున్నారంటూ తనపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి స్పందించారు. నేడు జరిగిన రెండో దశ లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఆయన కుమారుడు నిఖిల్ మాండ్య స్థానం నుంచి పోటీ చేశారు. అలాగే ఆయన తండ్రి దేవెగౌడ కూడా ఎన్నికల బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో వారసత్వ రాజకీయాలు చేస్తున్నారంటూ కుమారస్వామిపై ఆరోపణలు వచ్చాయి. అయితే వారసత్వ రాజకీయాలు అనే అంశం ముఖ్యం కాదని, దేశం ఎదుర్కొంటున్న సమస్యలే ముఖ్యమని కుమారస్వామి వ్యాఖ్యానించారు.

వారసత్వ, ప్రాంతీయ రాజకీయాల వలన దేశంలోని పలు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో ముందుకెళ్లాయన్నారు. బీజేపీ చేస్తున్న విమర్శలను తాము విస్మరిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఓటర్లంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని.. వారు తీసుకునే నిర్ణయమే దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందని కుమారస్వామి పేర్కొన్నారు. 14 లోక్‌‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి 10 నుంచి 12 స్థానాలు గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Thu, Apr 18, 2019, 07:50 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View