తనను కలవాలంటూ 175 మంది అసెంబ్లీ అభ్యర్థులకు, 25 మంది లోక్ సభ అభ్యర్థులకు చంద్రబాబు ఆహ్వానం
Advertisement
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈనెల 22న రాష్ట్ర రాజధాని అమరావతిలో తమ పార్టీ అభ్యర్థులతో ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. తాజాగా, టీడీపీ అభ్యర్థులతో టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడిన చంద్రబాబు పోలింగ్ సందర్భంగా జరిగిన పరిణామాలపై వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా పలువురు అభ్యర్థులు చంద్రబాబుకు ఎన్నికల సంఘంపై ఫిర్యాదులు చేశారు. దీనిపై టీడీపీ అధినేత స్పందిస్తూ, ఈసీపై తమ పోరాటం ఆ అవకతవకలపైనే అని స్పష్టం చేశారు. అనంతరం, అమరావతిలో జరిగే సమావేశానికి అందరూ హాజరుకావాలంటూ ప్రత్యేకంగా కోరారు.

అంతకుముందు అభ్యర్థులతో మాట్లాడుతూ వాళ్లకు ఉత్సాహం కలిగించే విషయాలు చెప్పారు. తాను అన్ని రకాల సర్వేలు, క్షేత్రస్థాయిలో సమాచారం తీసుకుని భేరీజు వేసుకున్న తర్వాత టీడీపీకి 120కి పైన సీట్లు రావడం ఖాయమని తెలుస్తోందని అన్నారు.  పక్కా సమాచారంతోనే ఈ మాట చెబుతున్నానని చంద్రబాబు అనడంతో టీడీపీ అభ్యర్థుల్లో ఒక్కసారిగా ఆనందం పెల్లుబికినట్టు సమాచారం!

ఇక, చంద్రబాబునాయుడు ఈనెల 23 నుంచి మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత ఆయన కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో మిత్రపార్టీల తరఫున ఎన్నికల సభలకు హాజరయ్యారు. ఈసారి ఉత్తరాది రాష్ట్రాల్లో చంద్రబాబు పర్యటన సాగే అవకాశం ఉంది. ముఖ్యంగా, ప్రధాని నరేంద్ర మోదీ సొంతరాష్ట్రం గుజరాత్ లోనూ బాబు ప్రచారం ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.
Thu, Apr 18, 2019, 04:36 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View