జీవీఎల్ పై చెప్పు విసిరింది ఓ డాక్టర్.. దాడి ఎందుకు చేశాడంటే..!
Advertisement
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుపై యూపీకి చెందిన శక్తి భార్గవ అనే వ్యక్తి చెప్పును విసిరిన సంగతి తెలిసిందే. సమావేశం మధ్యలో ఈ ఘటన జరగడంతో జీవీఎల్ కొద్దిక్షణాలు షాక్ కు గురయ్యారు. వెంటనే తేరుకున్న బీజేపీ కార్యకర్తలు, పోలీసులు సదరు వ్యక్తిని బయటకు తీసుకెళ్లారు. కాగా, ఈ ఘటనకు పాల్పడింది. యూపీలోని కాన్పూర్ కు చెందిన డాక్టర్ శక్తి భార్గవగా ఢిల్లీ పోలీసులు గుర్తించారు.

ఈయన కాన్పూర్ లో భార్గవ హాస్పిటల్ ను నడుపుతున్నాడని అన్నారు. మూడు ఖరీదైన బంగ్లాలను కొనుగోలు చేసిన విషయంలో ఐటీ అధికారులు 2018లో భార్గవకు చెందిన ఆసుపత్రిపై దాడులు నిర్వహించారని పోలీసులు వెల్లడించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సోదాల్లో అధికారులు రూ.50 లక్షల విలువైన నగలతో పాటు రూ.28 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ మూడు ఖరీదైన భవంతులను శక్తి భార్గవ రూ.11.50 కోట్లు వెచ్చించి కొన్నారనీ, అయితే ఇందుకు అవసరమైన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో ఆయన చెప్పలేదన్నారు.

అంతేకాకుండా ఈ మూడు భవంతులను భార్య, పిల్లల పేరుపై ఆయన రిజిస్టర్ చేయించారని అన్నారు. దీంతో ఈ వ్యవహారంపై ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన బినామీ చట్టం కింద విచారణ సాగుతోందన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వ తీరుపై మనస్తాపం చెందిన భార్గవ.. తన నిరసనను తెలియజేసేందుకే అధికార పార్టీ నేత అయిన జీవీఎల్ పై చెప్పును విసిరాడని వ్యాఖ్యానించారు.
Thu, Apr 18, 2019, 03:55 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View