పాకిస్థాన్ లో దారుణం.. 14 మంది ప్రయాణికులను కాల్చిచంపిన ఉగ్రమూకలు!
Advertisement
దాయాది దేశమైన పాకిస్థాన్ మరోసారి నెత్తురోడింది. పాక్ లోని బలూచిస్థాన్ ప్రావిన్సులో బస్సుల్లో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులపై 20 మంది సాయుధులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అనంతరం ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. ఈ దుర్ఘటనలో బస్సుల్లో ప్రయాణిస్తున్న 14 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో భద్రతాబలగాలు ముష్కరమూకలను ఏరివేసేందుకు గాలింపును ముమ్మరం చేశాయి.

ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ..కరాచీ-గ్వాదర్ నగరాల మధ్య రాకపోకలు సాగిస్తున్న ఆరు బస్సులను సాయుధ దుండగులు అడ్డుకున్నట్లు తెలిపారు. అనంతరం ఐడీ కార్డులు తనిఖీలు చేస్తున్నట్లు నటిస్తూ బస్సులోని ప్రయాణికులను కిందకు దించారని చెప్పారు. అనంతరం ఒక్కసారిగా వారిపై బుల్లెట్ల వర్షం కురిపించారని పేర్కొన్నారు. దీంతో ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రజలు తలోదిక్కు పరిగెత్తారని వ్యాఖ్యానించారు.

ఈ ఘటనలో పలువురికి తీవ్రగాయాలు అయ్యాయన్నారు. మరోవైపు ఈ దాడి తామే చేశామని ఇంతవరకూ ఏ ఉగ్రసంస్థ ప్రకటించుకోలేదు. పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ లో ప్రస్తుతం వేర్పాటువాద ఉద్యమం నడుస్తోంది. తమకు ప్రత్యేక దేశం కావాలంటున్న బలోచ్ ప్రజలు.. ఇక్కడ చైనా ప్రభుత్వం ‘చైనా-పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్’ను నిర్మించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయినా ప్రభుత్వాలు మొండిగా ముందుకు వెళుతుండటంతో తీవ్రమైన హింస చెలరేగుతోంది. గతవారం ఇక్కడే జరిగిన ఉగ్రదాడిలో 20 మంది ప్రజలు దుర్మరణం చెందారు.
Thu, Apr 18, 2019, 02:54 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View