నా గురించి మాట్లాడే అర్హత పవన్ కల్యాణ్ కు లేదు: చంద్రబాబు ఫైర్
Advertisement
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం విశాఖ జిల్లాలో పలుచోట్ల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఓ రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ పై వ్యాఖ్యలు చేశారు. ఒక అవినీతి పరుడికి, తనకు పవన్ కల్యాణ్ సమాన దూరం పాటించడంలో అర్థంలేదని అన్నారు. ఒక నేరస్తుడ్ని, తనను ఒకే గాటన కట్టి సమదూరం పాటించడం సరికాదని అన్నారు. రాష్ట్రం పక్షాన ఉంటారో, అవినీతిపరుల పక్షాన ఉంటారో పవన్ తేల్చుకోవాలని చంద్రబాబు పేర్కొన్నారు. మరోవైపు, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటాడని, అతడిని ప్రశ్నించే దమ్ము పవన్ కల్యాణ్ కు ఉందా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ను ప్రశ్నించలేని వ్యక్తికి తన గురించి మాట్లాడే అర్హత లేదని పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు విపక్షనేత జగన్ పైనా విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ కేసుల భయంతో కేసీఆర్, మోదీలకు ఊడిగం చేయడానికి సిద్ధపడ్డాడని ఎద్దేవా చేశారు. నేరాలు చేసే జగన్ నవ్వుతూనే తిరుగుతాడని, పైకి మాత్రం ఏమీ తెలియనివాడిలా ఉంటాడని విమర్శించారు. కానీ, తాను తప్పులు చేస్తున్న విషయం జగన్ అంతరాత్మకు తెలుసని చంద్రబాబు పేర్కొన్నారు.

రౌడీలు రాజకీయాల్లో ఉంటే ఎంతో ప్రమాదం అని, హత్యలు చేసి ఎదుటివాళ్లపై మోపే తత్వం జగన్ సొంతం అని ఆరోపించారు. ఇప్పుడు, జగన్, కేసీఆర్, మోదీ అందరూ కలిసి రాష్ట్రంపై గద్దల్లా పడిపోతున్నారని మండిపడ్డారు. ఎదిరించానని మోదీకి తనపై కోపం అని, అందుకే ఐటీ దాడులు, సీబీఐ దాడులు, ఈడీ దాడులు చేయిస్తుంటారని విమర్శించారు. తనకు ఇలాంటి దాడులంటే అస్సలు భయం లేదని, గతంలో తనపై 24 మందుపాతరలతో దాడిచేశారని, ఆ దాడికి పాల్పడినవాళ్లకు సెల్ ఫోన్లు ఇచ్చి సాయం చేసింది వైఎస్ మనుషులేనని చంద్రబాబు ఆరోపించారు.
Fri, Mar 22, 2019, 09:57 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View