బీజేపీ అగ్రనేతలకు యెడ్యూరప్ప రూ. 1800 కోట్ల ముడుపులు ఇచ్చారు: కాంగ్రెస్ ఆరోపణ
Advertisement
కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్పపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. యెడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీ అగ్రనేతలకు రూ. 1800 కోట్లు ముట్టజెప్పారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా సంచలన ఆరోపణలు చేశారు. 'యెడ్డీ డైరీస్' అనే ఒక డైరీని ప్రస్తావిస్తూ... ఇందులో యెడ్యూరప్ప సహా పలువురు బీజేపీ సీనియర్ నేతల పేర్లు ఉన్నాయని తన చేతిలోని ప్రతులను చూపించారు. దేశానికి కాపలాదారుడినని చెప్పుకునే వ్యక్తి (మోదీ) దీనిపై దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.

ఈ డైరీలో అరుణ్ జైట్లీ, రాజ్ నాథ్ సింగ్ వంటి ఎందరో అగ్రనేతల పేర్లు ఉన్నాయని సూర్జేవాలా అన్నారు. బీజేపీ నేతలు రూ. 1800 కోట్లు లంచంగా తీసుకున్నారని విమర్శించారు. దీనిపై యెడ్యూరప్ప సంతకం కూడా ఉందని చెప్పారు. 2017 నుంచి ఈ డైరీ ఆదాయపు పన్ను విభాగం వద్ద ఉందని తెలిపారు. దీనిపై మోదీ ఎందుకు విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు.

బీజేపీపై ఇలాంటి ఆరోపణలు ఉన్నప్పుడు వెంటనే విచారణ జరిపించాలని అన్నారు. లోక్ పాల్ కూడా ఇప్పుడు నియమితులయ్యారని... ఈ వ్యవహారంపై వెంటనే దర్యాప్తు చేయించాలని తాము డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. ఈ వ్యవహారానికి సంబంధించి 'ద కారవాన్' అనే పత్రికలో ఒక కథనం వచ్చింది. బీజేపీ అగ్రనేతలకు యెడ్డీ సీఎంగా ఉన్నప్పుడు రూ. 1800 కోట్లు అందాయని కథనంలో పేర్కొంది.
Fri, Mar 22, 2019, 05:35 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View