గాజువాకలో మీ బంధువులెవరైనా ఉంటే నాకు ఓటేయమని చెప్పండి ప్లీజ్!: పవన్ కల్యాణ్
Advertisement
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విశాఖపట్నం సౌత్ నియోజకవర్గంలో గురువారం రాత్రి జరిగిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సభికుల ముఖాల్లో నవ్వులు పూయించారు. గాజువాకలో మీకు తెలిసినవాళ్లు గానీ, బంధువులు కానీ ఉంటే నాకు ఓటేయమని చెప్పండి ప్లీజ్! అంటూ చమత్కరించారు. అంతేకాదు, ఏదైనా మంచి మాట చెప్పొచ్చు కదా అనగానే, సభికులంతా సీఎం, సీఎం అంటూ నినాదాలు చేయడంతో పవన్ ముఖంలో దరహాసం విరిసింది.

అంతకుముందు పవన్ మాట్లాడుతూ, విశాఖలో రౌడీయిజం ఆనవాళ్లు కనిపించినా తనకెంతో బాధ కలుగుతుందని అన్నారు. ఒకవేళ రౌడీయిజం కనిపిస్తే మాత్రం తాను రోడ్లమీదకు రావాల్సి ఉంటుందని హెచ్చరించారు. వైజాగ్ అంటే తనకు చాలా దగ్గరైన నగరం అని, తాను నటనలో ఓనమాలు దిద్దుకుంది ఇక్కడేనని అన్నారు. నిలువెత్తు ధైర్యానికి ప్రతీక అయిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారికి మీ ఓటు వేయాలంటూ పిలుపునిచ్చారు.

ఇదే సందర్భంలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ఉషశ్రీని అందరికీ పరిచయం చేశారు. ఉషశ్రీ క్రీడారంగం అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. ఆమె ఓసారి బ్యాడ్మింటన్ ఆటలో గెలిస్తే జనసేన పార్టీ జెండా ఎగరేసిందని పవన్ కల్యాణ్ తెలిపారు. ఇక, తన రాజకీయ ప్రత్యర్థులు చంద్రబాబు, జగన్ ల గురించి చెబుతూ... తాను రూ.8 వేలు ఇస్తానని ప్రకటిస్తే, చంద్రబాబు పదివేలు ఇస్తానంటారని, జగన్ అయితే ఏకంగా పది వజ్రాలిచ్చేస్తానని చెబుతారని సెటైర్ వేశారు.
Thu, Mar 21, 2019, 08:59 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View