స్పైస్ జెట్ సంస్థలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న 260 మంది జెట్ ఎయిర్ వేస్ పైలట్లు
Advertisement
భారత్ లో విమానయాన రంగం తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతోంది. ఇప్పటికే కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ దివాలా తీయగా, ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎయిరిండియా కూడా కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. కొన్నాళ్ల కిందట దేశీయ విమాన సంస్థలకు గట్టిపోటీ ఇచ్చిన జెట్ ఎయిర్ వేస్ పరిస్థితి కూడా దిగజారింది. కొన్నినెలలుగా ఆ సంస్థకు చెందిన విమానాలు వందలకొద్దీ నిలిచిపోయాయి. నెలల తరబడి జీతాలు చెల్లించకపోవడంతో జెట్ ఎయిర్ వేస్ పైలట్లు విధులకు రాకపోవడంతో విమానాలు ఎయిర్ పోర్టులకే పరిమితం అయ్యాయి. ఇప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోవడంతో జెట్ ఎయిర్ వేస్ పైలట్లు స్పైస్ జెట్ సంస్థలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటున్నారు.

 జెట్ ఎయిర్ వేస్ యాజమాన్యానికి పైలట్లు మార్చి 31వ తేదీ వరకు డెడ్ లైన్ విధించారు. అప్పటిలోగా జీతం బకాయిలు చెల్లించకపోతే ఏప్రిల్ 1 నుంచి పూర్తిస్థాయిలో విధుల నుంచి తప్పుకుంటామని హెచ్చరించారు. ఈ క్రమంలో 260 మంది జెట్ ఎయిర్ వేస్ ఫ్లయిట్ కెప్టెన్లు, సాధారణ పైలట్లు స్పైస్ జెట్ సంస్థ గురువారం ముంబయిలో నిర్వహించిన ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. తాజా పరిణామాల నేపథ్యంలో మరికొన్ని రోజుల్లో జెట్ ఎయిర్ వేస్ అధ్యాయం ముగిసిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Thu, Mar 21, 2019, 08:17 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View