కుటుంబాన్ని పోషించుకునేందుకు వాచ్‌మేన్‌గా మారిన బాలీవుడ్ నటుడు!
Advertisement
Advertisement
తాను సినిమా నటుడ్నని ఆయన నామోషీ పడలేదు. బతుకుదెరువు కోసం వాచ్‌మేన్‌గా మారాడు. అతనే బాలీవుడ్ నటుడు సవీ సిద్ధు! సినిమా అవకాశాలు లేక కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఆయన వాచ్‌మేన్‌గా మారాడు. ఆయనకు సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో అవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్‌తో కలిసి పోలీస్ ఆఫీసర్‌గా నటించిన ఆయన్ను వాచ్‌మేన్‌గా చూసిన నెటిజన్లు ఆవేదనకు గురయ్యారు.

దీంతో సిద్ధూకి అవకాశాలు కల్పించమంటూ బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌కు మెసేజ్‌లు పంపుతున్నారట. దీనిపై అనురాగ్ ఆసక్తికరంగా స్పందించారు. కుటుంబాన్ని పోషించుకునేందుకు సిద్ధు ఆ వృత్తిని ఎంచుకున్నందుకు ఆయన పట్ల గౌరవం పెరిగిందంటూనే ఓ నటుడి పట్ల జాలిపడి అవకాశాలు ఇవ్వకూడదన్నారు.

మీకేదైనా సాయం చేయాలనిపిస్తే వారి సినిమాలను చూడండంటూ సలహా కూడా ఇచ్చేశారు. ‘నా సినిమాల్లో ఆయనకు మూడు సార్లు అవకాశం ఇచ్చాను. సినిమాల్లేకుండా ఖాళీగా ఉంటున్న ఇతర నటుల్లా కాకుండా ఆయన తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఓ ఉద్యోగం ఎంచుకున్నందుకు ఆయన పట్ల నాకు గౌరవం పెరిగింది. కొందరైతే సినిమాల్లేక తాగుబోతులుగా మారుతుంటారు.

నవాజుద్దిన్‌ సిద్ధిఖి కూడా వాచ్‌మేన్‌గా, వెయిటర్‌గా పని చేసి ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. రోడ్లపై భేల్‌పురి అమ్ముకుంటున్న ఓ నటుడ్ని నేను కలిశాను. ఇవన్నీ నేను ఎందుకు చెబుతున్నానంటే.. సినిమాల్లేవని ఓ నటుడి పట్ల జాలి పడి అవకాశాలివ్వకూడదు. అది వారిని అవమానించినట్లవుతుంది. సిద్ధు తన జీవితాన్ని తానే రక్షించుకోవాలి.

ఆయన కోసం ఏదన్నా సాయం చేయాలనుకుంటే కాస్టింగ్‌ డైరెక్టర్ల వద్దకు తీసుకెళ్లగలం. వాచ్‌మేన్‌ అంటే చిన్న ఉద్యోగం అని తీసిపారేస్తున్నారు. అదేమీ చిన్న ఉద్యోగం కాదు. అలాగని పెద్దదీ కాదు. ఆయన అయితే అడుక్కోవడంలేదు. ఒకవేళ సిద్ధులాంటి ఆర్టిస్ట్‌లకు మీరు ఏదైనా సాయం చేయాలనుకుంటే వారు నటించిన సినిమాలను థియేటర్‌కు వెళ్లి టికెట్లు కొనుక్కుని చూడండి. అప్పుడే వారి విలువను గుర్తించి మరిన్ని అవకాశాలు ఇవ్వడానికి ముందుకొస్తారు. అంతేకానీ, ఇలా ఆయన పడుతున్న బాధలను నాకు వివరించడంలో అర్థం లేదు. నేను చెప్పదలచుకున్నది ఇంతే. ధన్యవాదాలు’ అని అనురాగ్ కుండబద్దలు కొట్టారు‌.
Tue, Mar 19, 2019, 09:01 PM
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View