టీమిండియా సాధించలేనిది శ్రీలంక సాధించింది!
Advertisement
కొన్నాళ్లుగా పడుతూ లేస్తూ ప్రస్థానం కొనసాగిస్తున్న శ్రీలంక క్రికెట్ జట్టు నమ్మశక్యం కాని ఆటతీరు కనబర్చింది. దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో అద్భుత విజయం సాధించి, తద్వారా రెండు టెస్టుల సిరీస్ ను 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. గత కొన్ని నెలలుగా లంక జట్టు ఆటతీరును పరిశీలిస్తున్న వాళ్లకు ఇది నిజంగా విభ్రాంతి కలిగించే విషయం అని చెప్పాలి. పోర్ట్ ఎలిజబెత్ వేదికగా జరిగిన రెండో టెస్టులో లంకేయులు 197 పరుగుల టార్గెట్ ను 2 వికెట్లు కోల్పోయి ఛేదించారు. అంతకుముందు తొలి టెస్టులోనూ శ్రీలంక సంచలన విజయం సాధించింది. దాంతో రెండింటికి రెండు టెస్టులు నెగ్గి సిరీస్ ను కూడా కైవసం చేసుకుంది. అంతేకాదు, దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ నెగ్గిన తొలి ఆసియా జట్టుగా రికార్డు పుటల్లో స్థానం సంపాదించింది.

ఇటీవలే సఫారీ గడ్డపై టీమిండియా సిరీస్ విజయానికి దగ్గరగా వచ్చినా అనూహ్య ఓటమితో అద్భుత అవకాశాన్ని చేజార్చుకుంది. అయితే శ్రీలంక మాత్రం మొండిపట్టుదలతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఇప్పటివరకు దక్షిణాఫ్రికా గడ్డపై ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లకు తప్ప మరో జట్టుకు సిరీస్ విజయం సాధ్యం కాలేదు. ఇప్పుడు లంకేయులు అమోఘమైన ఆటతీరుతో ఆ రెండు జట్ల సరసన చేరారు. క్రికెట్ బోర్డులో తీవ్ర సంక్షోభం కారణంగా ఉనికే ప్రమాదంలో పడిన దశలో శ్రీలంక క్రికెట్ కు ఈ విజయం కొత్త ఉత్సాహాన్నందిస్తుందనడంలో సందేహం లేదు. 
Sat, Feb 23, 2019, 09:41 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View