టి20ల్లో ఆస్ట్రేలియా రికార్డు బద్దలు కొట్టిన ఆఫ్ఘనిస్తాన్
Advertisement
అంతర్జాతీయ క్రికెట్లో గత కొంతకాలంగా నిలకడగా విజయాలు సాధిస్తూ క్రమంగా ఎదుగుతున్న జట్టు ఆప్ఘనిస్థాన్. ఆఫ్ఘన్ తో మ్యాచ్ అంటే పెద్ద జట్లు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, అహ్మద్ షెజాద్ వంటి ఆటగాళ్లు అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పుతూ తమ జట్టుకు మరపురాని విజయాలు అందిస్తున్నారు. ఇప్పుడు తమ ఆటతీరు గాలివాటం కాదని నిరూపిస్తూ ఆప్ఘనిస్థాన్ ఏకంగా ప్రపంచ రికార్డు బద్దలు కొట్టింది. హేమాహేమీలున్న అగ్రశ్రేణి జట్లకే వీలుకాని రీతిలో అంతర్జాతీయ టి20 క్రికెట్లో అత్యధిక స్కోరు నమోదు చేసింది.

డెహ్రాడూన్ లో శనివారం ఐర్లాండ్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. తద్వారా టి20 క్రికెట్లో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా రికార్డు పుటల్లోకెక్కింది. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉంది. ఆసీస్ 2016లో శ్రీలంకతో ఆడుతూ 3 వికెట్లకు 263 పరుగులు చేసింది. ఇప్పటివరకు అదే అత్యధిక స్కోరు. ఇప్పుడు హజ్రతుల్లా జాజాయ్ అద్భుత బ్యాటింగ్ సాయంతో ఆఫ్ఘనిస్థాన్ జట్టు ఆసీస్ రికార్డును బ్రేక్ చేసింది. ఓపెనర్ గా బరిలో దిగిన జాజాయ్ కేవలం 62 బంతుల్లో 162 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి స్కోరులో 16 సిక్సర్లు, 11 ఫోర్లు ఉన్నాయి. మరో ఓపెనర్ ఉస్మాన్ ఘని (48 బంతుల్లో 73) కూడా ధాటిగా ఆడడంతో ఆఫ్ఘన్ రికార్డు స్కోరు నమోదు చేసింది.
Sat, Feb 23, 2019, 09:16 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View