పెళ్లి చేసుకుంటావా? అంటూ 'చల్ల'గా ప్రపోజ్ చేసిన ప్రియుడు.. కరిగిపోయిన ప్రియురాలు!
Advertisement
రెండు హృదయాల ఏక స్పందన ప్రేమ! ప్రేమ తలకెక్కాలే కానీ శరీరం మొత్తం పాకిపోవడానికి అట్టే సమయం పట్టదు! అమెరికాకు చెందిన బాబ్ లెంపా అనే యువకుడు కూడా నిండా ప్రేమలో మునిగిపోయాడు. తన ప్రేయసి కోసం వినూత్నంగా ప్రపోజ్ చేయడంతో ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిలో పడ్డాడు. చికాగో నగరంలో ఉండే బాబ్ లెంపా కొంతకాలంగా పెగ్గీ బేకర్ అనే అమ్మాయిని ఇష్టపడుతున్నాడు.

 తన ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లడానికి ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే సరైన ముహూర్తంగా ఎంచుకున్నాడు. కానీ చికాగోలో భారీగా మంచు కురుస్తుండడంతో లెంపా ప్రణాళికలన్నీ తలకిందులయ్యాయి. దాంతో ఎలాగైనా పెగ్గీ బేకర్ కు ప్రపోజ్ చేయాలని నిర్ణయించుకుని బుర్రకు పదును పెట్టాడు. చికాగోలో ప్రముఖ లవర్స్ పార్క్ గా పేరుగాంచిన మ్యాగీ డాలే పార్క్ లో కురిసిన మంచుపై మ్యారీ మీ అంటూ రాసి పెగ్గీ బేకర్ కు చూపించాలని నిర్ణయించుకున్నాడు.

ఇంతకీ, లెంపా ఆ పార్క్ నే ఎంచుకోవడానికి కూడా ఓ మంచి కారణం ఉంది. అతని ప్రేమికురాలు పనిచేసే ఆఫీసు ఆ పార్క్ పక్కనే ఉంది. దాంతో మంచులో ఎంతో కష్టపడి, దాదాపు 6 గంటల పాటు శ్రమించి మ్యారీ మీ అంటూ భారీ ఆంగ్ల అక్షరాలను అందంగా పొందుపరిచాడు. ఆమె తన ఆఫీసులో 37వ ఫ్లోర్ నుంచి చూస్తే స్పష్టంగా కనిపించేలా డిజైన్ చేశాడు. ఆఫీసులో అందరూ కిటికీ వద్దకు వెళ్లి పార్క్ వైపు చూస్తుండడం గమనించిన బేకర్ కూడా వెళ్లి చూసి ముగ్ధురాలైంది. ఆ అద్భుతమైన ప్రపోజల్ తన ప్రియుడు బాబ్ లెంపా చేసిందేనని తెలుసుకుని సిగ్గుల మొగ్గలా మారిపోవడమే కాదు, యస్ అంటూ పెళ్లికి తాను కూడా సిద్ధమేనని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
Fri, Feb 22, 2019, 08:03 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View