మా పరిచయం ఈనాటిది కాదు: కోడి రామకృష్ణకు నివాళులర్పించిన చిరంజీవి
Advertisement
ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ భౌతికకాయాన్ని టాలీవుడ్ అగ్రనటుడు చిరంజీవి సందర్శించారు. హైదరాబాద్, ఫిల్మ్ నగర్ లోని నివాసంలో కోడి రామకృష్ణ భౌతిక కాయానికి చిరంజీవి నివాళులర్పించారు. అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, కోడి రామకృష్ణ మరణవార్త విని చాలా దిగ్భ్రాంతికి లోనయ్యానని అన్నారు. తమ పరిచయం ఈనాటిది కాదని, దాదాపు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా తమ మధ్య పరిచయం ఉందని, ఈరోజుకీ తమ స్నేహం కొనసాగుతోందని అన్నారు.

కోడి రామకృష్ణ మొదటి సినిమా ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ తనతోనే తీశారని గుర్తుచేసుకున్నారు. ఆ టైమ్ లో యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో తాను చాలా బిజీగా ఉన్నానని, అలాంటి సమయంలో, ఓ ఫ్యామిలీ డ్రామా చిత్రంలో నటించమని నిర్మాత రాఘవ తనను అడిగారని, అయితే, ఆ చిత్రంలో నటించేందుకు మొదట తాను అంత సుముఖత వ్యక్తం చేయలేదని, చేయలేనని చెప్పేశానని గుర్తుచేసుకున్నారు.

చిరంజీవిని కన్విన్స్ చేసుకుంటాను, ఆయనతో ఓ సమావేశం ఏర్పాటు చేయమని ఆ నిర్మాతకు కోడి రామకృష్ణ చెప్పడం జరగిందని అన్నారు. ఆ తర్వాత తమ ఇంటికి కోడి రామకృష్ణ వచ్చారని, ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ కథను ఎంతో చక్కగా చెప్పడంతో తాను చాలా ఇంప్రెస్ అయ్యానని, ఈ సినిమా వదులుకోకూడదని అనుకుని, ఈ చిత్రంలో నటిస్తానని ఆయనకు చెప్పడంతో చాలా సంతోషించిన విషయాన్ని చిరంజీవి ప్రస్తావించారు. ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ విజయం సాధించడమే కాదు, దాదాపు ఒకటిన్నర ఏడాది పాటు ఆడిన ఈ చిత్రం తనకు ఓ అరుదైన రికార్డును తెచ్చిపెట్టిందని అన్నారు. 
Fri, Feb 22, 2019, 07:35 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View