ఇమ్రాన్ ఖాన్ పాక్ సైన్యం చేతిలో కీలుబొమ్మ: అదను చూసి రంగంలోకి దిగిన మాజీ భార్య
Advertisement
పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పై ఆయన మాజీ భార్య రెహామ్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. పుల్వామా ఉగ్రదాడిపై ఇమ్రాన్ ఖాన్ తన స్పందన తెలియజేసిన కొన్ని గంటలకే రెహామ్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ సైన్యం చేతిలో కీలుబొమ్మ అన్నది ఆమె ప్రధాన ఆరోపణ.

ఏం మాట్లాడాలన్నా ఆయన సైన్యం వైపు చూస్తారని, మిలిటరీ ఆదేశాలు లేనిదే ఏమీ మాట్లాడలేని ప్రధానమంత్రి అని విమర్శించారు. కొన్ని అంశాల్లో రాజీపడడం ద్వారానే ఆయన అధికారంలోకి వచ్చారని రెహామ్ ఖాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏం చేయాలన్నా ఏం మాట్లాడాలన్నా సైన్యం సూచనలు అందాల్సిందేనని ఎద్దేవా చేశారు. పుల్వామా దాడిపై ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రకటన కూడా ఈ కోవలోకే వస్తుందని ఆమె అన్నారు. పుల్వామా దాడి ఘటనపై తన స్పందన వెలిబుచ్చేందుకు కూడా సైనికాధికారుల సూచనల కోసం వేచిచూశాడని ఆరోపించారు.

బ్రిటీష్ పౌరసత్వం ఉన్న రెహామ్ ఖాన్ ప్రముఖ పాత్రికేయురాలిగా గుర్తింపు పొందారు. మొదట ఇజాజ్ రెహ్మాన్ అనే వ్యక్తిని పెళ్లాడిన రెహామ్ ఖాన్ 2005లో అతడికి విడాకులిచ్చారు. ఆ తర్వాత ఇమ్రాన్ ఖాన్ తో చాలాకాలం ప్రేమ వ్యవహారం నడిపి 2015లో పెళ్లి చేసుకున్నారు. అదేం విచిత్రమో కానీ, అదే ఏడాది విడాకులు తీసుకుని ఎవరి దారిన వారు విడిపోయారు. వీరి దాంపత్యం కేవలం 10 నెలలు మాత్రమే సాగింది. ఇమ్రాన్ నుంచి విడిపోయే సమయంలో సంచలన ఆరోపణలు చేశారు రెహామ్ ఖాన్. తనను ఇమ్రాన్ వంటింటి కుందేలుగా మార్చాలని చూశారని, బయటి వ్యక్తులతో తనను కలవనిచ్చేవారు కాదని మండిపడ్డారు. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ పుల్వామా ఘటన కారణంగా ఇరకాటంలో పడ్డ నేపథ్యంలో అదను చూసి ఆరోపణలు గుప్పించారు రెహామ్ ఖాన్.
Tue, Feb 19, 2019, 10:31 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View