ముఫ్తీ మహ్మద్ నిర్ణయమే 40 మంది సైనికుల ప్రాణాలను బలిగొందా?
Advertisement
జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో భారత జవాన్లపై ఉగ్రవాదులు అంత సులభంగా ఎలా తెగబడ్డారు?. కట్టుదిట్టమైన భద్రత మధ్య వెళ్లే సైనిక కాన్వాయ్‌ని ఓ ఉగ్రవాది వాహనంతో వచ్చి ఎలా ఢీకొట్ట గలిగాడు? అసలు సైనిక కాన్వాయ్ వెళ్తుంటే ఇతరుల వాహనం రోడ్డుపైకి ఎలా వచ్చింది? ఈ ప్రశ్నలన్నింటికి ఒకే ఒక్క సమాధానం కనిపిస్తోంది. 2002-2005 మధ్య కశ్మీర్‌ను పాలించిన ముఫ్తీ మహ్మద్ సయీద్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయమే ఇందుకు కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

నిజానికి సైనిక కాన్వాయ్ వెళ్తున్నప్పుడు భద్రత దృష్ట్యా పౌర వాహనాలను ఆపేస్తారు. భద్రతా దళాలు రహదారులను పూర్తిగా మూసివేసి తమ అధీనంలోకి తీసుకుంటాయి. దీనివల్ల ఉగ్రదాడులకు అవకాశం ఉండేది కాదు. ఒకవేళ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి కాన్వాయ్‌లోకి ప్రవేశిస్తే కాల్చివేసేవారు. దీంతో సైనిక కాన్వాయ్ వెళ్తున్నప్పుడు ఉగ్రవాదులు కూడా అందులోకి చొరబడేందుకు భయపడేవారు.

అయితే, ఆర్మీ కాన్వాయ్ వెళ్లే ప్రతిసారీ ఇలా పౌర వాహనాలను ఆపివేయడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటూ అప్పుటి పీడీపీ-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఈ నిబంధనను ఎత్తివేసింది. సైనిక కాన్వాయ్ వెళ్తున్నప్పుడు పౌర వాహనాలను ఆపాల్సిన పనిలేదని, అవి కూడా వెళ్లొచ్చంటూ నిబంధనలు సవరించి ముఫ్తీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఇప్పుడు అదే నిర్ణయం 40 మంది జవాన్లు అమరులు కావడానికి కారణమైందని చెబుతున్నారు. సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్ వెళ్తుంటే మార్గమధ్యం నుంచి దూసుకొచ్చిన ఉగ్రవాది సైనికుల వాహనాలను ఢీకొట్టి విధ్వంసానికి పాల్పడ్డాడు. ముఫ్తీ ప్రభుత్వం అప్పుడా నిర్ణయం తీసుకోకపోయి ఉంటే నేడు ఉగ్రవాదులు ఇంతగా బరితెగించి ఉండేవారు కాదన్న వాదన వినిపిస్తోంది.
Sun, Feb 17, 2019, 06:59 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View