పుల్వామా ఘటన...చిన్న ఏమరుపాటుకు భారీ మూల్యం
ఒక చిన్నపొరపాటు భారీ మూల్యానికి కారణమైంది. జమ్ముకశ్మీర్‌ రాష్ట్రం పుల్వామా జిల్లాలో ఉగ్రవాదుల దాడికి అవకాశం కల్పించింది.  సైనికుల రాకపోకల సందర్భంగా సాధారణ పౌరులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదన్న సైన్యాధికారుల నిర్ణయం తమలో కొందరి ప్రాణాల మీదికి తెచ్చింది. సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల కాన్వాయ్‌ వెళ్తుండగా ఆ దారిలో పౌరవాహనాలను అనుమతించడం మానవ బాంబుకు గొప్ప అవకాశంగా మారిందని సీఆర్‌పీఎఫ్‌ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

సైనికుల రాకపోకలు జరిపే మార్గాన్ని రోడ్‌ ఓపెనింగ్‌ పార్టీ (ఆర్‌ఓపీ) తొలుత తనిఖీ చేస్తుంది. దారిలో మందుపాతరలు, బాంబులు వంటి వాటిని పసిగడుతుంది. ఉగ్రవాదులు రోడ్డుపక్కన మాటువేసి దాడిచేసేందుకు వీలులేకుండా కొందరు సైనికులు కాపుకాస్తారు. అంతా సజావుగా ఉంటే సైనిక వాహనాలకు అనుమతిస్తారు. ఈ సమయంలో సాధారణ పౌరులకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో వారి వాహనాలను మాత్రం పట్టించుకోరు. పుల్వామా ఘోరానికి ఇదే అవకాశాన్ని ఇచ్చింది.

గురువారం జమ్ము- శ్రీనగర్‌ జాతీయ రహదారిని తనిఖీ చేశాకే సైనిక వాహనాలకు అనుమతిచ్చారు. హిమపాతం కారణంగా ఆరు రోజులుగా మూసివున్న ఈ రహదారిని గురువారమే తెరవడంతో వాహనాల రద్దీ కూడా అధికంగా ఉంది. ఈ హైవేను ఆనుకుని సర్వీస్‌ రోడ్లు ఉన్నాయి. చుట్టుపక్క వారు ఈ సర్వీస్‌ రోడ్లలో రాకపోకలు జరుపుతుంటారు. నిత్యం తనిఖీలంటే ప్రజలకు ఇబ్బంది అని వారి వాహనాలను వదిలేస్తారు. జైషే ఉగ్రవాది ఆదిల్‌ దీన్నే అవకాశంగా మార్చుకున్నాడు. పేలుడు పదార్థాలతో తన వాహనాన్ని సర్వీస్‌ రోడ్డులో నిలిపి సైనిక వాహనాల శ్రేణి రాగానే జాతీయ రహదారిపైకి దూసుకువచ్చాడు. భారీ సంఖ్యలో సైనికులను పొట్టన పెట్టుకున్నాడు.

‘ఉగ్రవాదులు ఐఈడీ దాడులు చేసే అవకాశం ఉందని ఈనెల 8న ఇంటెలిజెన్స్‌ వర్గాలు హెచ్చరించడంతో అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. అయినా ఈ ఘోరం జరగడం ఆశ్చర్యం కలిగించింది’ అని సీఆర్‌పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ (ఆపరేషన్స్‌) జుల్ఫికర్‌ హసన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మరో అధికారి మాట్లాడుతూ ‘ఉగ్రవాది సుదూర ప్రాంతం నుంచి వాహనంలో వచ్చి ఉంటే ఎక్కడో ఒకచోట తనిఖీల్లో దొరికిపోయేవాడు. సమీపం నుంచి రావడం వల్లే ఈ ఘోరం జరిగింది. ఈ అనుభవం దృష్ట్యా ఇకపై సైనిక వాహన శ్రేణి వెళ్తున్నప్పుడు పౌర వాహనాలను అనుమతించకూడదు’ అని సూచించారు.
Sat, Feb 16, 2019, 11:26 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View