దాతల విరాళమే డిపాజిట్‌గా సర్పంచ్‌ అభ్యర్థి నామినేషన్‌
Advertisement
దాతలు, స్థానికులు విరాళంగా ఇచ్చిన పెద్దమొత్తం చిల్లర పట్టుకుని నామినేషన్‌ వేసేందుకు వచ్చిన ఓ విద్యావంతుడిని చూసి ఎన్నికల అధికారి ఆశ్చర్యపోయారు. వివరాలు తెలుసుకున్న తర్వాత అతని నామినేషన్‌ను స్వీకరించారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా ఆత్మకూరు మండలం చౌళ్లపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

 తెలంగాణ రాష్ట్రంలో రెండు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రెండో విడత నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో విద్యావంతుడైన ఎదులాపురం శ్రవణ్‌కుమార్‌ సర్పంచ్‌గా పోటీ చేయాలని ఆసక్తి చూపాడు. ఇందుకు గ్రామస్థులు కూడా సై అన్నారు. నామినేషన్‌ సందర్భంగా కట్టాల్సిన డిపాజిట్‌, ఇతరత్రా ఖర్చు కోసం ప్రజలు విరాళాలు సమకూర్చారు. ఆ మొత్తం వెయ్యి రూపాయల చిల్లర నాణాల రూపంలో ఉండడంతో ఓ సంచిలో మూటకట్టి దరఖాస్తు పట్టుకుని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి వద్దకు వెళ్లి, నామినేషన్‌ దాఖలు చేశాడు.

ఈ సందర్భంగా శ్రవణ్‌ మాట్లాడుతూ ఓటుకు నోట్లు ఇచ్చే శక్తి తనకు లేదని, ప్రజల ఆదరాభిమానాలే తనకు శ్రీరామ రక్షని చెప్పారు. వారి ఆదరాభిమానాలతో గెలుపు కూడా సొంతం చేసుకుంటానన్న నమ్మకం ఉందని తెలిపాడు. చౌళ్లపల్లిలో 2200 జనాభా ఉండగా, 1545 మంది ఓటర్లు ఉన్నారు.
Sat, Jan 19, 2019, 10:39 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View