కాంగ్రెస్ కార్యకర్తలపై ఈగను కూడా వాలనివ్వను!: కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి
- కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓటమిపై అనుమానాలు ఉన్నాయి
- డబ్బు, ఈవీఎంల ట్యాంపరింగ్ తో టీఆర్ఎస్ గెలిచింది
- హామీలు నెరవేర్చక పోతే టీఆర్ఎస్ నేతల భరతం పడతాం

కాంగ్రెస్ పార్టీని వీడి పారిపోయేంత పిరికిపందను తాను కాదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. అవసరమైతే కేసీఆర్ ను కాంగ్రెస్ లో చేర్పిస్తానే తప్ప... తాను టీఆర్ఎస్ లో చేరనని ఆయన తెలిపారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం కాంగ్రెస్ కార్యకర్తలపై ఈగను కూడా వాలనివ్వనని చెప్పారు. తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓటమిపై చాలా అనుమానాలు ఉన్నాయని అన్నారు. కేసీఆర్ ఎలా గెలిచారో అర్థం కావడం లేదని చెప్పారు. మునుగోడులో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల కృతజ్ఞత సభలో ఆయన మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు.
డబ్బు సంచులు, ఈవీఎంల ట్యాంపరింగ్ తో టీఆర్ఎస్ 88 స్థానాలను గెలుచుకుందని ఈ సందర్భంగా కోమటిరెడ్డి ఆరోపించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే టీఆర్ఎస్ నేతల భరతం పడతామని హెచ్చరించారు. వచ్చే పార్లమెంటు, పంచాయతీ ఎన్నికల్లో సత్తా చూపుతామని ధీమా వ్యక్తం చేశారు. లోక్ సభ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి 2 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందుతారని చెప్పారు. తన నియోజకవర్గంలోని 6 మండలాల్లో తన తల్లి సుశీలమ్మ ట్రస్ట్ తరపును 6 అంబులెన్సులను ఏర్పాటు చేస్తామని తెలిపారు.



