హీరో ప్రభాస్ పిటిషన్ పై హైకోర్టు విచారణ.. ధర్మాసనానికి బదిలీ చేస్తూ ఆదేశాలు
Advertisement
హైదరాబాద్, రాయదుర్గంలోని ‘పైగా’ భూముల్లో ఉన్న తన గెస్ట్ హౌస్ ప్రభుత్వ ఆక్రమిత స్థలంలో ఉందంటూ రెవెన్యూ అధికారులు సీజ్ చేయడాన్ని సవాల్ చేస్తూ హీరో ప్రభాస్ నిన్న హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ విషయమై ప్రభాస్ దాఖలు చేసిన పిటిషన్ పై నేడు విచారణ జరిగింది.

కనీస నిబంధనలు పాటించలేదని, నోటీస్ కూడా ఇవ్వకుండా ప్రభాస్ గెస్ట్ హౌస్ ను సీజ్ చేసిన విషయాన్ని ఆయన తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే, ఈ వివాదం చాలా మందికి సంబంధించిందని, ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనానికి బదిలీ చేయాలని రిజిస్ట్రీని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ ఆదేశించారు. దీంతో ఈ పిటిషన్ పై ధర్మాసనం రేపు విచారణ జరపనున్నట్టు సమాచారం.

కాగా, రాయదుర్గంలోని ‘పైగా’ భూములపై కొన్నేళ్లుగా వివాదం నెలకొంది. ఆ భూములు ప్రభుత్వానివేనని సుప్రీంకోర్టు ఇటీవలే తేల్చి చెప్పిన నేపథ్యంలో అక్కడి కట్టడాలను రెవెన్యూ అధికారులు ఈమధ్య కూల్చి వేశారు. అక్కడే ఉన్న ప్రభాస్ గెస్ట్ హౌస్ లో ఎవరూ లేకపోవడంతో, దాన్ని రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. దీనిని సవాల్ చేస్తూ ప్రభాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అధికారులు తదుపరి చర్యలు చేపట్టకుండా ఉండేలా ఉత్తర్వులు జారీ చేయాలని తన పిటిషన్ లో ప్రభాస్ అభ్యర్థించాడు. 
Wed, Dec 19, 2018, 05:15 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View