వారసుడు ఉండకూడదని బావ కుమారుడికి విషమిచ్చిన మహిళ!
Advertisement
డబ్బుపై ఆశ మనిషిని జంతువు కన్నా హీనంగా మార్చేస్తోంది. తాజాగా తమ ఇంట్లో మగపిల్లాడు(వారసుడు) లేనందున ఓ మహిళ తన బావ కుమారుడికి ఏకంగా విషమిచ్చి హత్య చేసింది. ఈ వ్యవహారంలో పోలీసులు లోతుగా విచారించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని సన్నూరు శివారులో రాజ్ నాయక్ తండాలో బానోతు సుజాత, రెడ్డి దంపతులు ఉంటున్నారు. వీరికి ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ క్రమంలో రెడ్డి సోదరుడిని రజిత అనే యువతికి ఇచ్చి కొన్నేళ్ల క్రితం వివాహం చేశారు. సుజాత-రెడ్డి దంపతులకు మగపిల్లాడు పుట్టడంతో రజిత ఈర్ష్య పెంచుకుంది. తన కుటుంబంలో లేని మగపిల్లాడు సుజాతకు ఉండటానికి వీలులేదని భావించింది. ఇటీవల జరిగిన దీపావళి పండుగ సందర్భంగా పిల్లాడికి విషం కలిపిన పాలను ఇచ్చింది.

ఇది తాగిన పిల్లాడు కొద్దిసేపటికి అపస్మారక స్థితిలోకి జారిపోయాడు. దీంతో వెంటనే తల్లిదండ్రులు పిల్లాడిని హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Wed, Nov 21, 2018, 03:34 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View