టీఆర్ఎస్ వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మనస్తాపం..పార్టీకి రాజీనామా!
Advertisement
వికారాబాద్ సీటు దక్కని టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సంజీవ్ రావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను టీఆర్ఎస్ కార్యాలయానికి పంపారు. వికారాబాద్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న చంద్రశేఖర్ కు తన మద్దతు ప్రకటిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, నాలుగున్నరేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న తనను మెతుకు ఆనంద్ ఎప్పుడూ కలవలేదని, అటువంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడం తనను బాధకు గురిచేసిందని అన్నారు. ఆ టికెట్ తనకు ఇవ్వలేదన్న బాధ లేదు, కానీ, పార్టీలో చాలా మంది కార్యకర్తలు ఉన్నారని, వారికిచ్చినట్టయితే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

తన ఆరోగ్యం బాగుండలేదంటూ తనకు టికెట్ ఇచ్చేందుకు నిరాకరించారని, తన భార్యకు టికెట్ ఇయ్యమని కోరితే, అందుకు అంగీకరించారని, చివరి నిమిషం వరకూ ఆమెకు టికెట్ ఇస్తామనే చెప్పారని అన్నారు. తనకు గానీ, తన భార్యకు గానీ టికెట్ ఇవ్వలేదన్న బాధ లేదు గానీ, ఈ టికెట్ ను ఫలానా వ్యక్తికి ఇస్తున్నామన్న విషయాన్ని ఇంతవరకూ తనకు ఎవరూ చెప్పలేదని ఆవేదన చెందారు. ఏ పార్టీలో చేరాలన్న ఆలోచన ఇంకా చేయలేదని, వికారాబాద్ నుంచి పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి చంద్రశేఖర్ కు తన మద్దతు ఇవ్వాలనుకుంటున్నట్టు చెప్పారు.
Wed, Nov 21, 2018, 03:26 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View