అప్పు ఇచ్చిన పాపానికి.. ప్రాణాలే కోల్పోయాడు!
Advertisement
తీసుకున్న అప్పును చెల్లించమని అడిగినందుకు ఓ వ్యక్తి ప్రాణాలనే కోల్పోయాడు. ఈ ఘటన హైదరాబాదు శివార్లలోని పటాన్ చెరు సమీపంలో ఉన్న హత్నూర గ్రామ శివార్లలో జరిగింది. పటాన్ చెరు డీఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం... హత్నూరకు చెందిన వడ్డె గణేష్ వద్ద ఐటీఐ కాలనీకి చెందిన వడ్డె ఆర్ముఖం ఆరు నెలల క్రితం కుటుంబ అవసరాల కోసం రూ. లక్ష అప్పుగా తీసుకున్నాడు. మూడు నెలల్లో వాయిదాల రూపంలో అప్పు చెల్లిస్తానని చెప్పిన ఆర్ముఖం... ఏడు నెలలు గడుస్తున్నా అప్పు చెల్లించలేదు. ఈ నేపథ్యంలో డబ్బులు చెల్లించమంటూ గణేష్ ఒత్తిడి పెంచాడు. దీంతో, అతన్ని అంతమొందిస్తే అప్పు చెల్లించాల్సిన అవసరం ఉండదని ఆర్ముఖం భావించాడు.

ఈ క్రమంలో, పలుమార్లు గణేష్ ను హత్య చేయాలని ప్రయత్నించినా కుదరలేదు. చివరకు అతన్ని ఎలాగైనా అంతమొందించాలని, 14వ తేదీన కటికరాళ్లగుట్ట వద్ద గణేష్ కోసం కాపుకాశాడు. అటువైపుగా వెళ్తున్న గణేష్ ను పలకరించాడు. కాసేపు మాట్లాడిన తర్వాత గణేష్ వెళ్తుండగా... తనతో తెచ్చుకున్న ఇనుపరాడ్ తో తలపై ఆర్ముఖం కొట్టాడు. అతను చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత గణేష్ జేబులో ఉన్న రూ. 2,500లతో పాటు రెండు సెల్ ఫోన్లను తీసుకుని పారిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా... తానే హత్య చేశానని ఆర్ముఖం ఒప్పుకున్నాడు. 
Sat, Nov 17, 2018, 10:02 AM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View