కూకట్ పల్లి ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్.. క్లారిటీ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ!
Advertisement
తమ ఇంట్లో మూడోతరం రాజకీయాల్లోకి రావడం చాలా సంతోషంగా ఉందని నందమూరి బాలకృష్ణ తెలిపారు. టీడీపీ హైకమాండ్ ఆదేశం మేరకే నందమూరి సుహాసిని కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారని చెప్పారు.. ‘ఎన్టీఆర్’ బయోపిక్ షూటింగ్ లో తాను బిజీగా ఉన్నప్పటికీ వీలు చేసుకుని వచ్చానని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల కోసం తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని బాలకృష్ణ అన్నారు. ఈ రోజు ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన అనంతరం బాలయ్య మీడియాతో మాట్లాడారు.

నటులు నందమూరి కల్యాణ్ రామ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు వాళ్ల సినిమా షెడ్యూల్స్ లో బిజీగా ఉన్నారని ఆయన తెలిపారు. నందమూరి సుహాసిని తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై వారిద్దరిని తాను ఇంకా సంప్రదించలేదని వెల్లడించారు. త్వరలోనే ఇద్దరితో మాట్లాడుతాననీ, వీలు చూసుకుని ఎన్టీఆర్, కల్యాణ్ రామ్.. ఇద్దరూ సుహాసిని తరఫున ప్రచారంలో పాల్గొంటారని బాలయ్య ఆశాభావం వ్యక్తం చేశారు.

మహాకూటమి నేతల తరఫున తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని బాలకృష్ణ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నెల 26 నుంచి రోడ్ షోలు, బహిరంగ సభలతో ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేస్తామన్నారు. నందమూరి సుహాసిని గెలుపే హరికృష్ణకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని బాలయ్య తెలిపారు. ఆమె విజయానికి యువత, టీడీపీ కార్యకర్తలు, ప్రజలు కలసి రావాలని పిలుపునిచ్చారు.
Sat, Nov 17, 2018, 09:36 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View