యుద్ధంలో హిట్లర్ ఓడిపోవడానికి కారణం ఇదే: ఇమ్రాన్ ఖాన్
Advertisement
అధికారాన్ని చేపట్టి 100 రోజులు పూర్తి కావస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జర్నలిస్టులతో మాట్లాడుతూ, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులు యూటర్న్ తీసుకోవడం సాధారణమైన అంశమని... యూటర్న్ తీసుకోనివారు రాజకీయ నాయకులే కాదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా జర్మనీ నియంత హిట్లర్ ను గుర్తు చేశారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో యూటర్న్ తీసుకోకపోవడం వల్లే హిట్లర్ ఓడిపోయారని చెప్పారు. నెపోలియన్ కూడా ఇలాంటి తప్పిదమే చేశారని తెలిపారు.

ముందుకు నడుస్తున్నప్పుడు ఎదురుగా గోడ ఉంటే... ఏదో ఒక దారి వెతుక్కోవాల్సి ఉంటుందని ఇమ్రాన్ అన్నారు. ఎన్నికల సమయంలో ఇమ్రాన్ ఖాన్ పలు వాగ్దానాలు చేశారు. అవినీతిని అంతం చేస్తామని, పేదరిక నిర్మూలనకు చర్యలు చేపడతామని, ఆర్థిక వ్యవస్థను మెరుగు పరుస్తామని ఆయన చెప్పారు. కానీ, అవేమీ వాస్తవరూపం దాల్చకపోవడంతో పాకిస్థాన్ ప్రజల్లో అసహనం మొదలైంది. హిట్లర్ ఉదంతాన్ని ఇమ్రాన్ లేవనెత్తడంతో... నెటిజన్లు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ శీతాకాలంలో మనమేమైనా రష్యాపై యుద్ధానికి వెళ్తున్నామా? అంటూ ఓ నెటిజన్ చమత్కరించాడు. 
Sat, Nov 17, 2018, 09:33 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View