కేసీఆర్ కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేసిన నటి ఖుష్బూ
Advertisement
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంపై ప్రముఖ నటి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం జడ్చర్లలో పర్యటించిన ఆమె విలేకరులతో మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాలుగు కోట్ల మందిని కేసీఆర్ కుటుంబంలోని నలుగురు పట్టి పీడిస్తున్నారని అన్నారు.

నిజామాబాద్ ఎంపీ కవిత తెలంగాణ రాష్ట్రంలో తానొక్కదాన్నే మహిళను అన్నట్టు రాజ్యమేలుతున్నారని, బతుకమ్మ పేరుతో ప్రజాధనాన్ని భారీగా దోచుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఏమో సెక్రటేరియట్‌కు వెళ్లకుండా ప్రజాధనంతో నిర్మించుకున్న ప్రగతి భవన్‌లో ఉంటూ ప్రజా సమస్యలను విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని, కేసీఆర్ మంత్రివర్గంలో అసలు మహిళలే లేరని అన్నారు. మేనిఫెస్టోను కేసీఆర్ ఎప్పుడో మర్చిపోయారని అన్నారు.  

లక్ష్మారెడ్డిపైనా ఖుష్బూ విరుచుకుపడ్డారు. వైద్య ఆరోగ్య శాఖామంత్రిగా నియోజకవర్గానికి ఆయన చేసిందేమీ లేదన్నారు. బినామీల పేరుతో వేల ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ నాలుగేళ్లలోనే రాష్ట్రాన్ని అప్పులమయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్చర్లలో మల్లు రవి గెలుపు నల్లేరు మీద నడకేనని విశ్వాసం వ్యక్తం చేశారు.
Sat, Nov 17, 2018, 07:27 AM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View