20 చోట్ల రెబల్స్... నేను వచ్చి అన్నీ చెబుతా... రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ కోరిన జానారెడ్డి!
Advertisement
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ జాబితా దశల వారీగా విడుదలవుతున్న నేపథ్యంలో, టికెట్ లభించని వారిలో అసంతృప్తి జ్వాలలు చెలరేగుతున్న వేళ, టీపీసీసీ నేతల తీరుతో మనస్తాపంతో ఉన్నానని, రాష్ట్ర రాజకీయాలపై వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెబుతూ, రాహుల్ గాంధీని కలిసేందుకు జానారెడ్డి అపాయింట్ మెంట్ కోరడం చర్చనీయాంశమైంది. ఈ ఉదయం ఢిల్లీ చేరుకున్న జానా, రాహుల్ పిలుపు కోసం వేచి చూస్తున్నారు. కనీసం 20 నియోజకవర్గాల్లో కాంగ్రెస్, టీడీపీల తరఫున రెబల్స్ బరిలోకి దిగే అవకాశం ఉందని, వీరంతా గెలుపు, ఓటములను ప్రభావితం చేయగలిగిన వారేనని అంటున్న జానారెడ్డి, వీరిని తక్షణం బుజ్జగించకుంటే, విజయం కష్టమవుతుందని రాహుల్ కు వివరించనున్నట్టు తెలుస్తోంది.

కాగా, మంచిర్యాల టికెట్ రాకపోవడంతో అరవింద్ రెడ్డి కాంగ్రెస్ కు రెబల్ గా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ కు రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరాలన్న ఆలోచనలో కూడా ఆయన ఉన్నట్టు సమాచారం. ఇక కోదాడ టికెట్ ను ఆశించిన టీడీపీ నేత బొల్లం మల్లయ్య యాదవ్, ఇప్పటికే టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇలాంటి పరిస్థితే పలు ప్రాంతాల్లో నెలకొనివుండటంతో, వీరిని బుజ్జగించి, కూటమి గెలుపునకు సహకరించేలా చూడాల్సిన బాధ్యత అధిష్ఠానంపై ఉందని, జానారెడ్డి కాంగ్రెస్ అధిష్ఠానానికి వివరించనున్నారు.
Thu, Nov 15, 2018, 10:55 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View