మేము 12 నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం: టీజేఎస్ నేత విశ్వేశ్వరరావు
Advertisement
మహాకూటమిలో భాగస్వామి అయిన తెలంగాణ జన సమితి (టీజేఎస్) 12 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ నేత విశ్వేశ్వరరావు స్పష్టం చేశారు. హైదరాబాద్ లో టీజేఎస్ నేతలు ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 12 నియోజకవర్గాలను తమకు కేటాయించాలని కోరుతున్నామని అన్నారు.

దుబ్బాక, మెదక్, మల్కాజ్ గిరి, అంబర్ పేట, సిద్దిపేట, వరంగల్ తూర్పు, వర్దన్నపేట, స్టేషన్ ఘన్ పూర్, అసిఫాబాద్, జనగామ, మహబూబ్ నగర్, మిర్యాలగూడ స్థానాలు కోరుతున్నామని అన్నారు. 12 సీట్లతో జాబితా ప్రకటించమని తమ పార్టీ అధ్యక్షుడు చెప్పారని, ఈమేరకే ఈ ప్రకటన చేస్తున్నామని అన్నారు.

తాము పోటీ చేసే స్థానాల సంఖ్య 12 నుంచి కూడా మారిపోవచ్చని.. ఆ స్థానాల సంఖ్య 13 లేదా 14 కూడా కావచ్చని వ్యాఖ్యానించారు. టీజేఎస్ పోటీ చేసే నియోజకవర్గాల విషయంలో తమకు స్పష్టత ఉందని చెప్పిన ఆయన, మహాకూటమిలో టీజేఎస్ కొనసాగుతుందని చెప్పడం గమనార్హం. కొన్ని నియోజకవర్గాల్లో స్నేహపూర్వక పోటీ ఉంటుందని అన్నారు.

సీట్ల కేటాయింపులపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో తమ పార్టీ అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ చర్చలు జరుపుతున్నారని, తాము బలంగా ఉన్న నియోజకవర్గాలను కచ్చితంగా తమకే కేటాయించాలని అడుగుతున్నామని వివరించారు.  
Wed, Nov 14, 2018, 06:42 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View