40 లక్షల ఉద్యోగాల కల్పనకు కేంద్రం యోచన
Advertisement
కేంద్ర మంత్రివర్గం నేడు సమావేశమైంది. ఈ భేటీలో భాగంగా పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ఈ సందర్భంగా కొత్త టెలికం పాలసీకి ఆమోద ముద్ర వేసింది. దీని ద్వారా వంద బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించి.. దేశంలో 40 లక్షల ఉద్యోగాలు కల్పించవచ్చని కేంద్రం భావిస్తోంది.

సెకనుకు 50 మెగా బైట్ల వేగంతో 5జీ సేవలను విస్తృతం చేయడం ద్వారా 2020 నాటికి దేశంలో 40 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని కేంద్రం అంచనా వేస్తోంది. దీనికోసం 5జీ వంటి నూతన సాంకేతిక పరిజ్ఞానంతో హైస్పీడ్ బ్రాడ్ బ్యాండ్ సేవలను విస్తృతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. స్పెక్ట్రం ధరలను హేతుబద్ధీకరించడం ద్వారా అప్పుల బారి నుంచి టెలికం రంగాన్ని బయటపడేయాలని కేంద్రం యోచిస్తోంది.

ఇక చెరకు రైతుల కోసం రూ.4500 కోట్ల ప్రత్యేక ప్యాకేజీకి ఆమోదం తెలిపింది. గత జూన్ నెలలో రూ.8500 కోట్లను ప్యాకేజీగా ప్రకటించిన విషయం తెలిసిందే. పంచదార ఎగుమతి కోసం మిల్లులకు రవాణా రాయితీ కింద ఈ ప్యాకేజీని పంపించేలా నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాలన్నింటికీ ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఆమోదం తెలిపింది.
Wed, Sep 26, 2018, 06:58 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View