కన్నడ హీరో 'దునియా' విజయ్ అరెస్ట్... గొడవపడి రోడ్డెక్కిన ఇద్దరు భార్యలు!
Advertisement
నిత్యమూ ఏదో ఒక వివాదంలో ఉండే కన్నడ హీరో 'దునియా' విజయ్ పై ఇప్పుడు కిడ్నాప్, దాడి కేసు నమోదై అరెస్ట్ కాగా, ఆయన ఇద్దరు భార్యలూ గొడవపడి రోడ్డెక్కారు. ఇప్పటికే జిమ్ ట్రైనర్ మారుతి గౌడతో వాగ్వాదానికి దిగి, ఆయన్ను కొట్టిన ఘటనలో విజయ్‌ తోపాటు మరో నలుగురిపై ఐపీసీ సెక్షన్ 323, 504, 506, 34సెక్షన్‌లకింద కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో ఆయన పెద్ద భార్య నాగరత్న, చిన్న భార్య కీర్తి గౌడలు గొడవ పడ్డారు.

నాగరత్నకు ముగ్గురు పిల్లలుండగా, ప్రస్తుతం విజయ్‌ చిన్నభార్య కీర్తిగౌడతో ఉంటున్నాడు. మారుతి గౌడతో గొడవ జరిగిన వేళ, నాగరత్న కుమారుడు సామ్రాట్‌, తన తండ్రితోనే ఉన్నాడు. తన కుమారుడు ఇంటికి రాకపోవడంతో ఆగ్రహానికి లోనైన నాగరత్న, కీర్తిగౌడ ఇంటికి వెళ్లి నిలదీయగా, ఆమె దగ్గరుండే బౌన్సర్లు అనుచితంగా ప్రవర్తించారట.

తన సంసారాన్ని కీర్తిగౌడ నాశనం చేసిందని, ఇప్పుడు పిల్లల్ని దూరం చేస్తోందని ఆరోపిస్తూ, తనపై బౌన్సర్లతో దాడి చేయించిందని గిరినగర్‌ పోలీస్‌ స్టేషన్‌ లో ఆమె ఫిర్యాదు చేసింది. ఈ కేసును నమోదు చేసుకునేలోగా, కీర్తిగౌడ కూడా పోలీ‌స్‌ స్టేషన్‌ కు వెళ్ళి, నాగరత్న తన ఇంటిపై దాడి చేసిందని ప్రతి ఫిర్యాదు చేసింది. ఓ వైపు భర్త విజయ్, అరెస్టయి, కోర్టుల చుట్టూ తిరుగుతున్న వేళ, ఆయన భార్యలిద్దరూ ఇలా రోడ్డెక్కి వివాదాన్ని పెంచడం చర్చనీయాంశమైంది.
Mon, Sep 24, 2018, 12:40 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View