ఇంటెలిజెన్స్ అధికారులను తెలంగాణలో పెట్టారు.. అందుకే మావోలు రెచ్చిపోయారు!: ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా
Advertisement
విశాఖ మన్యంలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమలను మావోయిస్టులు హత్య చేయడంపై ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీ నారాయణ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ లో ఇంటెలిజెన్స్ అధికారులను తెలంగాణ ఎన్నికలకు వినియోగించడం వల్లే ఈ దారుణం చోటుచేసుకుందని విమర్శించారు. 2014 తర్వాత ఏపీలో పోలీస్, నిఘా వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయాయని విమర్శించారు. పోలీసులు ప్రోటోకాల్ సేవలకే పరిమితమయ్యారని కన్నా తెలిపారు. సమస్యల పరిష్కారానికి ప్రాణాలు తీయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించారు.

నిన్న విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ఇద్దరు అధికార పార్టీ నేతలను మావోయిస్టులు దారుణంగా హత్యచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆగ్రహానికి లోనైన గ్రామస్తులు, ఎమ్మెల్యే మద్దతుదారులు డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు. దొరికిన పోలీసులను దొరికినట్లు చావబాదారు. అనంతరం బయట ఉన్న పోలీస్ ఔట్ పోస్టుకు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో పలు వాహనాలు, ఫైళ్లు కాలి బూడిదయ్యాయి.
Mon, Sep 24, 2018, 11:44 AM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View